నారాయణఖేడ్, జూలై 22: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులపై కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ రాజేశ్ తరచూ వసతి గౄహానికి వచ్చి తమను కింది అంతస్థులోకి పిలిచి పైన చేయివేసి తడుముతూ అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని సోమవారం రాత్రి విద్యార్థినులు నారాయణఖేడ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కొన్ని రోజులుగా విద్యార్థినులు ఈ తరహా వేధింపులకు గురవుతుండగా వార్డెన్ దూషణలు, ఆమె కుమారుడి వేధింపులతో విసిగిపోయిన విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆయా విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మంగళవారం హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటనపై ఏఎస్డబ్ల్యువో భాగ్యలక్ష్మి, బాలిక ఫిర్యాదు మేరకు వార్డెన్ శారద, రాజేశ్, ఇద్దరు సిబ్బందిపై పోక్సో కేసు నమోదైంది.