ఉమ్మడి పాలనలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడమనేది ఒక ప్రహసనం. అటవీ, పర్యావరణ పర్మిషన్లు దశాబ్దాల తరబడి కొన‘సాగు’తూనే ఉండడం చేదువాస్తవం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మన ప్రాజెక్టులకు వడివడిగా డీపీఆర్‌లు సిద్ధం కాగా, వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. 18 నెలల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి లభించగా..ఇటీవల స్వల్ప వ్యవధిలోనే మరో 5 ప్రాజెక్టులకు అనుమతులు సాధించి తెలంగాణ సర్కారు ప్రాజెక్టుల నిర్మాణంపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకొన్నది.
CM KCR | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడమనేది ఎన్నో వ్యయప్రయాసలకు సంబంధించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని మొత్తంగా 18 డైరెక్టర్టరీల నుంచి ఆమోదం పొందాల్సి ఉండగా అందులో హైడ్రాలజీ, అంతరాష్ట్ర నదీ జల విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ అండ్ ఎస్టిమేషన్, భూగర్భజల శాఖ, టెక్నికల్ అప్రయిజల్ కమిటీ తదితర ఆరు రకాల అనుమతులను కచ్చితంగా పొందాల్సిందే. ఇక వాటిలోనూ తొలుత ప్రాజెక్టు చేపట్టాలంటే అందుకు నీటి లభ్యత అంశమే కీలకపాత్ర పోషిస్తుంది.
దీనిని హైడ్రాలజీ విభాగం నిర్ధారించి చెప్తుంది. అప్పుడే ప్రాజెక్టును రూపొందించుకోవడం సాధ్యమవుతుంది. దానిపై ఆధారపడే ఇతర విభాగాలు అనుమతులు మంజూరు చేస్తుంటాయి. వీటితోపాటు పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల నుంచి కూడా అనుమతులను పొందాల్సి ఉంటుంది. అనుమతుల మంజూరుకు ఇప్పటి వరకు కేంద్రం వద్ద ఎలాంటి నిర్ణీత కాలపరిమితి అంటూ లేదు. ఇక అన్నివిభాగాల నుంచి ప్రాజెక్టులకు అనుమతులను పొందాలంటే ఏండ్లు గడిచిపోవాల్సిందే. అనేక రాష్ర్టాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాజెక్టులు అనుమతులు మంజూరు కాకుండానే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల సంగతి అదే పరిస్థితి.
స్వల్పకాలంలో ఐదు ప్రాజెక్టులకు..
కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం ఇటీవల గెజిట్‌ను జారీచేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అనుమతిలేని ప్రాజెక్టులన్నింటికీ తెలంగాణ, ఏపీ ఇరు రాష్ర్టాలు ఆరు నెలల్లోగా అనుమతులు పొందాల్సి ఉన్నది. లేదంటే ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణతోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులను కూడా నిలిపేయాల్సిందేనని కేంద్రం షరతులు విధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ఇప్పటికే పూర్తయిన, ప్రస్తుతం పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులన్నింటికీ నిర్దేశిత గడువులోగా అనుమతులను సాధించేందుకు చర్యలు ముమ్మరం చేసింది.
కేంద్రం గెజిట్‌లో పేర్కొన్న 11 ప్రాజెక్టులకుగాను మొత్తంగా సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, గూడెం, చనాకా -కొరాట, మోడికుంట, చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి సమర్పించింది. మిగిలిన నాలుగింటిలో కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ, కందకుర్తి లిఫ్ట్, రామప్ప-పాకాల లింక్, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతులే అక్కర్లేదని ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. తాజాగా వార్ధా బరాజ్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కూడా అందజేసింది. ఇప్పటివరకు సమర్పించిన డీపీఆర్‌లలో మొత్తంగా ఐదు ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ తుది అనుమతులను మంజూరు చేసింది. మిగిలిన మూడు డీపీఆర్‌లకు సైతం ఇప్పటికే కీలక అనుమతులు రాగా, తుది అనుమతులు పొందే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటం విశేషం.
సవాలక్ష కొర్రీలను అధిగమించి..
గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతుల మంజూరుకు ఎలాంటి అడ్డంకులు లేవు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి జలాల్లో తెలంగాణకు 967.94 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి, అందులో ఇప్పటికే 758.76 టీఎంసీలను వినియోగానికి చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులుండగా, మరో 148.82 టీఎంసీలకు సైతం గతంలోనే హైడ్రాలజీ విభాగం క్లియరెన్స్ ఇచ్చింది. భవిష్యత్తు అవసరాల కోసం 60.26 టీఎంసీల జలాలను రిజర్వ్‌లో పెట్టారు. నీటి లభ్యతతోపాటు ట్రిబ్యునల్ కేటాయింపులు సైతం ఉండటంతో ఆయా ప్రాజెక్టులు అనుమతులు పొందడానికి పెద్దగా అడ్డంకులు ఏమీ లేవని సాగునీటి రంగ నిపుణులు మొదటి నుంచి చెప్తున్నారు.
ఇటీవల సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక సైతం అదేవిషయాన్ని స్పష్టం చేసింది. అయినా తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌ల అనుమతులు మంజూరుకు సీడబ్ల్యూసీ ఆది నుంచీ సవాలక్ష కొర్రీలను పెట్టడం గమనార్హం. పర్యావరణం, ఫైనాన్స్, ఇరిగేషన్ తదితర విభాగాలన్నీ అనుమతులిస్తున్నా సీడబ్ల్యూసీ మాత్రం అడుగడుగునా మోకాలడ్డుతూ వచ్చింది. శాస్త్రీయ అధ్యయనం, నిబంధనల పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, దశాబ్దాల కిందటి రికార్డులను తిరగేస్తూ..ఆపై ఏపీ అభ్యంతరాల తెలుపుతున్నదనే సాకును చూపుతూ..వాటిపై వివరణలు ఇవ్వాలని పర్మిషన్ల మంజూరుకు తెలంగాణకు పరీక్షనే పెట్టింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో తెలంగాణ అధికారులు వాటన్నింటినీ అధిగమించి అనుమతులను సాధించడం అభినందనీయం.
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే..
సీడబ్ల్యూసీ వ్యవహారం తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. అయినప్పటికీ నిర్దేశిత గడువులోగా అనుమతులను సాధించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోఅధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇందుకోసం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండే, ఈఎన్సీ హరిరాంకు బాధ్యతలు అప్పగించడంతోపాటు ప్రభుత్వం ఏకంగా ఢిల్లీలో ప్రత్యేకంగా కొంత మంది ఇంజినీరింగ్ అధికారులను సైతం నియమించడం విశేషం. డీపీఆర్‌ల అనుమతుల ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నది. సీడబ్ల్యూసీ రోజుకో అంశాన్ని లేవనెత్తడం, అందుకు సంబంధించిన ఆధారాలను సిద్ధం చేసుకుని తెలంగాణ అధికారులు ఢిల్లీకి పరుగులు తీయడం నిత్యకృత్యంగా మారింది.
సందేహాలను నివృత్తి చేసి తిరిగి వచ్చేలోగానే సీడబ్ల్యూసీ మరో మెలిక పెట్టడం పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు, ఇంజినీరింగ్ అధికారులు ఎక్కడా నిరాశకు లోనుకాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూ అనుమతులను సాధిస్తున్నారు. అందుకు చనాకా- కొరాటా బరాజ్ ఉదాహరణగా నిలుస్తున్నది. చనాకా- కొరాటా ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉమ్మడిగానే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వం బరాజ్ నిర్మాణం సైతం ఇప్పటికే పూర్తి చేసినా మహారాష్ట్ర మాత్రం ఒప్పందంలో భాగంగా తన పోర్షన్‌కు సంబంధించిన పనులకు ఇప్పటికీ కనీసం పరిపాలన అనుమతులను కూడా మంజూరు చేయలేదు. అదీగాక 0.5 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులను కూడా తీసుకోవడం లేదు.
దీంతో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడానికి తీవ్ర అవాంతరం ఎదురుకాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ మూడేండ్లపాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మహారాష్ట్రతో సంబంధం లేకుండా తాము చేపట్టిన 80 శాతం పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి విన్నవిస్తూ రావడంతోపాటు గతంలోనూ తెలంగాణ, మహారాష్ట్ర చేపట్టిన ఉమ్మడి ప్రాజెక్టులకు వేర్వేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయని, అందుకు లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టే నిదర్శనమని సోదాహరణంగా గట్టిగా వాదనలు వినిపించింది. దీంతో ఎట్టకేలకు తెలంగాణ వాదనలతో ఏకీభవించిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ మహారాష్ట్రతో సంబంధం లేకుండా అనుమతులివ్వగా, టీఏసీ నుంచి తుది అనుమతులుకు పొందడం విశేషం.
సీడబ్ల్యూసీ నిబంధనలే కృష్ణా ప్రాజెక్టులకు అడ్డంకి
కృష్ణా నదీపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం సవాల్‌గా మారింది. నాటి ఉమ్మడి పాలకుల కుట్రలు నేడు కృష్ణా ప్రాజెక్టులకు శాపంగా పరిణమించాయి. అదీగాక సెంట్రల వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నిబంధనలు కూడా ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఉమ్మడి ఏపీ పాలకులు పూర్తిగా నదీ బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించకుండా, బేసిన్ అవతలి సీమాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించుకుంటూ వచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువభాగం ప్రాజెక్టులను వరదజలాల ఆధారంగానే రూపొందించారు. కంటితుడుపు చర్యగా కొన్ని ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించినా ఆ ప్రాజెక్టుల పనులను మాత్రం పూర్తి చేయని విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనకు ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నది. నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే సీడబ్ల్యూసీ అనుమతులను మంజూరు చేయాల్సి ఉంటుంది. వరద జలాలపై ఆధారపడి నిర్మించే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయకూడదు.
ఆ నిబంధనే శరాఘాతంగా మారింది. ఎందుకంటే కృష్ణా నదీపై తెలంగాణ ప్రాజెక్టులను నాటి ఉమ్మడి ఏపీ పాలకులు వరదజలాల ఆధారితంగా నిర్మించారు. అనుమతులు మంజూరు చేశారు. వాటికి అనుమతులు రావడం అసాధ్యమని నిపుణులు వివరిస్తున్నారు. అనుమతులను సాధించాలంటే ట్రిబ్యునల్ కేటాయింపులు జరిగేదాక వేచిచూడాల్సిందే. అదీగాక ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ అవార్డు అమలు కూడా పెండింగ్‌లో ఉంది. అది ఎప్పటికి తేలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే కృష్ణా ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ముందుకుపోలేని పరిస్థితి ఉన్నది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా, ఇప్పటికీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నికర జలాలను కేటాయించి అనుమతుల కోసం డీపీఆర్‌ను సమర్పించడం ప్రభుత్వం కృషికి నిదర్శనంగా నిలుస్తున్నది.
కాళేశ్వరం ఒక రికార్డు
స్వరాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేత్వత్వంలో ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలోనూ ప్రత్యేకతను చాటుకొన్నది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు నిదర్శనం. 240 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకొంటూ కొత్తగా 18,25,700 ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు 18,82,970 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను 2016 జూన్ 21న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేవలం ఏడాదిన్నర సమయంలోనే ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ నుంచి అన్నిరకాల అనుమతులను సాధించి సీఎం కేసీఆర్ కొత్త చరిత్రకు నాంది పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫ్లడ్, మల్టీపర్పస్ ప్రాజెక్టుల టెక్నికల్ అడ్వయిజర్ కమిటీ 2018లో తుది అనుమతులను మంజూరు చేయడం విశేషం.
Ppp