హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రోడ్ల అభివృద్ధిపై విడుదల చేసిన విజన్ డాక్యుమెంటులో ప్రకటించిన భవిష్యత్తు ప్రణాళికలన్నీ బీఆర్ఎస్ సర్కార్ సిద్ధంచేసినవే. వీటిని వెంటనే చేపడితే తెలంగాణలో రహదారుల నెట్వర్క్ మరింత బలపడి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వాటిలో పలు ప్రాజెక్టులకు కేంద్రం గతంలోనే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గత రెండేండ్లుగా ఒక్క ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించని కాంగ్రెస్ ప్రభు త్వం.. గతంలో మంజూరైన ప్రాజెక్టులనే తాజాగా విజన్ డాక్యుమెంట్లో పేర్కొని, వచ్చే పదేండ్లలో ఏదో సాధించబోతున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నది.
రహదారుల అభివృద్ధితో తెలంగాణ వేగంగా పురోగమిస్తుందన్న ఉద్దేశంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. అందులో భాగంగా పదేండ్లలో దాదాపు 17 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ, రాష్ట్ర రహదారులను ఏర్పాటు చేసింది. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు పెద్ద ఎత్తున కొత్త రోడ్లను ఏర్పాటు చేసింది. రీజినల్ రింగు రోడ్డు సహా పలు అంతర్రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వాటిలో చాలావరకు సాధించింది. ఫలితంగా తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 2,511 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారులు 2022 నాటికి 4,999 కి.మీ.లకు చేరుకున్నాయి.
రెండేండ్లలో ఒక్క రోడ్డు ప్రారంభమైతే ఒట్టు
రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు ఒక్క కొత్త రహదారి పనులను కూడా ప్రారంభించలేదు. ఒక్క కొత్త రహదారిని కూడా మంజూరు చేయించలేదు. కనీసం రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్) భూసేకరణ కూడా పూర్తిచేయలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూములే తప్ప గత రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు. అయినప్పటికీ వచ్చే పదేండ్లలో దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఇటీవల విజన్ డాక్యుమెంట్లో ప్రకటించింది. ఇవన్నీ కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులే. కాగా, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం గతంలో భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నవారు సైతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెనుకాడుతున్నారు. వారిలో పలువురు కోర్టులను సైతం ఆశ్రయించారు. దీంతో ట్రిపుల్ఆర్ నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచినప్పటికీ వాటిని ఖరారు చేయలేకపోతున్నది. రాష్ట్ర రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నది. గత రెండేండ్లలో వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను ఇంతవరకు శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పదేండ్లకు ప్రణాళికను విడుదల చేయడం విమర్శలకు తావిస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన,అనుమతులు పొందిన రహదారులు.
