ఇల్లెందు, ఏప్రిల్ 15 : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన ఇల్లెందులోని జగదాంబ సెంటర్లో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి పక్కనే ఉన్న గోడపై రజతోత్సవ ప్రచార వాల్ రైటింగ్ను ప్రారంభించారు.
7వ వార్డులో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి ఎల్కతుర్తి సభకు రావాలని ఆహ్వానించారు. అనంతరం భారీ ర్యాలీతో పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుని, స్థానిక ఫంక్షన్ హాలులో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వద్దిరాజు, రేగా మాట్లాడుతూ.. ప్రజలను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనం బీఆర్ఎస్ రజతోత్సవ సభతో ప్రారంభమవుతుందని వారు చెప్పారు. అనంతరం వారు రజతోత్సవ సభ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.