మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఆయన పట్టణంలో సుమారు 120 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ముందుగా మంత్రి రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల వ్యయంతో యెనుగొండ లో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏడు అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయల వ్యయంతో బండమీదిపల్లి నుంచి అల్లిపూర్ వరకు నిర్మించిన రోడ్డును సందర్శించారు.
అంతేకాక 15 లక్షల రూపాయల వ్యయంతో బుడగ జంగాల కాలంలో నిర్మించిన బిటి రోడ్డు సిసి రోడ్డు ను ప్రారంభించారు. మరో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి బ్రాహ్మణ వాడిలోని దూద్ దవాఖాన పైన ఉన్న మహిళా సమాఖ్య భవనంలో మూడు కోట్ల 45 లక్షల రూపాయల విలువ చేసే 25 కుట్టు మిషనులు, 2 ఎంబ్రాయిడరీ మిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎంవీఎస్ కళాశాలలో మరో 3 కోట్ల 20 లక్షల రూపాయలతో 12 అదనపు తరగతి గదులను నిర్మించనున్నామని, స్టేడియం నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గతంలో ఎంవీఎస్ కళాశాల పౌల్ట్రీ షెడ్ లో కొనసాగిందని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు వెచ్చించి అదనపు తరగతి గదుల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు.
ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. త్వరలోనే పాత కలెక్టరేట్ స్థానంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన వంటివి నిర్మిస్తున్నామని, ప్రశాంతమైన నగరంగా మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దాలని, ఇందుకు ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతకుముందు మంత్రి భూత్పూర్ నుంచి రాయచూరు వెళ్లే జాతీయ రహదారిని అమిస్టపూర్ వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు, ఆర్ డి ఓ పద్మశ్రీ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్,డి ఈ రాములు, డి ఈ ఓ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.