CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని, రెండుమూడు రోజుల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్న ట్టు చెప్పారు. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ వర్సిటీ ఆడిటోరియంలో బుధవారం బ్యాకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కోర్సును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. పరిశ్రమ అవసరాలను తీర్చడం, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా బీఎఫ్ఎస్ఐ కోర్సును ప్రారంభించినట్టు తెలిపారు. స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ ఆఫ్ క్యాంపస్‌లను రాష్ట్రం లో ప్రారంభించాలని ఆయా సంస్థలను కోరినట్టు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌లోనూ ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టాలని ని ర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇంజినీరింగ్ పట్టాలు అందుకుంటున్న లక్షలాది విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టీచింగ్ స్టాఫ్‌లో సరైన నైపుణ్యాలు లేవని, ఇలా ప్రమాణాలు లేని కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ వలలో చిక్కుకుంటున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. గంజాయి తాగడం నుం చి దానిని విక్రయించే దశకు బీటెక్ విద్యార్థులు చేరుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
బీఎఫ్ఎస్ఐ కోర్సును రాష్ట్రంలోని 10 వేల మంది ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ కోర్సు నిర్వహణకు ఎక్విప్ సంస్థ రూ. 2.5 కోట్లు అందజేసిందని పేర్కొన్నారు. మొదటి 10వేల మందికి ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కోర్సులో చేరిన వారికి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తామని తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మూసీనది ఒడ్డున, బఫర్ జోన్ పరిధిలో నివసిస్తున్న వారికి గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించనున్నట్టు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా నది ఒడ్డున, బఫర్‌జోన్ పరిధిలో సుమారు 15,000మంది నివసిస్తున్నట్టు గుర్తించారు. వారిని అక్కడి నుంచి తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పునరావాసం కల్పించనున్నట్టు తెలిపారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.