Praja Palana | మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్16 : ఓ నిరుపేద రైతు కుటుంబంపై విద్యుత్ శాఖ అధికారులు తమ ప్రతాపాన్ని చూపించారు. కి దరఖాస్తు చేసుకున్నామని చెప్తున్నా, కరెంట్ బిల్లు కట్టడం లేదని ఆ ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ కుటుంబం రాత్రంతా చీకట్లోనే గడపాల్సిన దుస్థితి. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం లింగాపూర్‌కు చెందిన రైతు కూరెళ్ల చెన్నారెడ్డి వ్యవసాయం చేయడంతోపాటు లారీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి నెలా తన ఇంట్లో 120 యూనిట్ల విద్యుత్తు మాత్రమే వినియోగిస్తున్నాడు. 200 యూనిట్లలోపు గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ అందిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ చెన్నారెడ్డికి మాత్రం అమలు కావడం లేదు. కరెంట్ బిల్లు కట్టడంలేదని అధికారులు ఆదివారం కరెంట్ సరఫరా నిలిపివేశారు. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక వీడియోతీసి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టుచేశారు.
‘చూడండ్రి మిత్రులారా.. ఇగో కరెంటోళ్ల ఆగడాలు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో.. ఇది నా ఇంటి సమస్యనే.. బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేసుకుపోతుండ్రు. కాంగ్రెస్ గర్నమెంట్ ఇచ్చిన హామీ ల్లో కరెంట్ బిల్లు మాఫీ .. రుణమాఫీ అని చెప్పిండ్రు.. రైతుబంధు, రుణమాఫీ లేదు, కరెంటోళ్లు కరెంట్ కట్ చేసుకపోయే పరిస్థితులున్నాయి.. మాకు వచ్చేది 130 యూ నిట్ల కంటే ఎక్కువ లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో 120 యూనిట్లు వచ్చినా కరెంట్ బిల్లు మాఫీ కావడం లేదు. ఎంపీడీవో ఆఫీసు చుట్టూ కరెంట్ బిల్లు మాఫీ అవుతలేదని చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. 30 ఏండ్లుగా కాంగ్రెస్‌లో సేవలందిస్తున్నం. కాంగ్రె స్ గవర్నమెంట్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నది’ అని చెన్నారెడ్డి వీడియోలో తన గోడును వెళ్లబోసుకున్నాడు.