హాలియా, ఫిబ్రవరి 8 : హాలియా మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం సృష్టించింది. ఈ పోస్టుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగుతిన్నారు. వివరాలు ఇలా.. ‘2019లో బీఆర్ఎస్ తరఫున ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వెంపటి పార్వతమ్మ హాలియా మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. 2022లో పార్వతమ్మ భర్త వెంపటి శంకరయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెంటనే పార్వతమ్మను మున్సిపల్ చైర్పర్సన్ పదవి నుంచి దింపేసి ఎడవల్లి అనుపమా నరేందర్‌రెడ్డిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకునేలా పావులు కదిపారు. 40 ఏండ్ల తరువాత ఆర్యవైశ్య సామాజికవర్గం వారికి చైర్పర్సన్ పదవి వస్తే కాంగ్రెస్ నాయకులు అకారణంగా దింపేయడం బాధకలిగించింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ఐదో వార్డు నుంచి అదే వర్గానికి చెందిన కరుణసాగర్కు టికెట్ ఇవ్వగా, 7వ వార్డు నుంచి చిట్టిపోలు శ్రీనివాస్‌కు బీఆర్ఎస్ అవకాశమిచ్చింది. జానారెడ్డి కుటుంబం మెప్పు కోసం ఆర్యవైశ్యులు కొందరు కరుణసాగర్కు మద్దతు ఇచ్చి, శ్రీనివాస్‌ను వ్యతిరేకించడం విచారకం’ అంటూ సదరు నాయకుడు పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.