హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): యాజమాన్య అలసత్వం, సర్కారు నిర్లక్ష్యంపై ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, రెండు వేతన సవరణలను అమలు చేస్తామని, యూనియన్ల కార్యకలాపాలను పునరుద్ధరిస్తామని, సంస్థను విస్తరిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కార్మికులంతా ఆగ్రహంతో ఉన్నారు. 2013 వేతన సవరణ బకాయిలు కేవలం డ్రైవర్లకే చెల్లించి ఆరు నెలలు గడిచినా మిగతా ఉద్యోగులకు చెల్లించకుండా జాప్యం చేస్తున్నదని మండిపడుతున్నారు. పదేండ్ల నుంచి ఆర్టీసీ నుంచి 13 వేల మంది కార్మికులు వైదొలిగినా, ఒక్కరినీ కొత్తగా నియమించకపోవడంతో పనిభారం పెరిగింది.మహాలక్ష్మి పథ కం అమలుతో డ్రైవర్, కండక్టర్లపై ఒత్తిడి అధికమైందని, చిన్నాచితక కేసులతో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటం : వెంకన్న, థామస్‌రెడ్డి
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చిందని తెలిపారు. తొలిరోజైన మంగళవారం కార్మికులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారని, శాంతియుత పోరాటానికి యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటాలు చేయడానికి కార్మికులంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎంజీబీఎస్, తార్నాక హాస్పిటల్, జూబ్లీబస్స్టేషన్లలో థామస్‌రెడ్డి సహా జేఏసీ నేతలైన సుద్దాల సురేశ్, బీ యాదయ్య, రఘురాం, పీబీ రావు, రాములు తదితరులు జేఏసీ పోరాట కరపత్రాలను పంచిపెట్టరు.