హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్యకారులు కొందరు ప్రభుత్వ పథకంలో భాగస్వాములై సొంత భూముల్లో చేపల పెంపకానికి కుంటలు ఏర్పాటుచేసుకొని పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2018-19లో ‘బ్లూ రెవల్యూషన్’ పథకం, 2020లో ప్రధానమంత్రి మత్స్యసంపద సమృద్ధి యోజన (పీఎంఎస్ఎస్వై) పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల కింద మత్స్యసహకార సంఘాలు సొంత భూము ల్లో చేపపిల్లల పెంపకానికి పాండ్లు చేసుకోవాలి. పనులు పూర్తయిన తర్వాత ప్ర భుత్వం బిల్లులు చెల్లించనుంది.
అందులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 400 మంది మత్స్యకారులు ఈ రెండు పథకాలకు 2020లో దరఖాస్తు చేసుకోగా అధికారులు వీరికి 2023లో మంజూరు చేశారు. పనులు పూర్తయిన అనంతరం కేంద్రం నుంచి 60 శాతం సబ్సిడీ వారి సహకార సంఘాల ఖాతాల్లో జమ అయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని ఇప్పుడు, అ ప్పుడు అంటూ తిప్పుకున్నది. ఇక ఇప్పుడు డీపీఆర్ నిబంధనల ప్రకారం పనులు చేయనందున బిల్లులపై ఆశలు పెట్టుకోవద్దని అధికారులు చెప్పినట్టు మత్స్యకారులు వాపోతున్నారు.
ఎకరం స్థలంలో నిర్మించిన పాండ్‌కు రూ.7 లక్షలు, ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1.50 లక్షలు చెల్లించాలి. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీ అం దుతుంది. అధికారులు తమ ప్రాజెక్టులకు ఆలస్యంగా మంజూరు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు అవి నిబంధనల ప్రకారం లేవంటూ బిల్లులు ఎగవేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ‘మీ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు. మీకు దండం పెడతా..అవసరమైతే కాళ్లు పట్టుకుంటాం.. బడ్జెట్ వచ్చినప్పుడు చెల్లిస్తాం’ అని అధికారులు అంటున్నారని మత్స్యకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.