KTR | ఒక కాంట్రాక్టర్ మంత్రిగా. ఇంకో బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నరు. పొంగులేటి ఎవరెవరి దగ్గర రియల్ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటున్నరో.. 30-40శాతం భూమిని ఎలా రాయించుకుంటున్నరో మాకు సమాచారం ఉన్నది. ఫోన్‌ట్యాపింగ్, కాళేశ్వరం, జన్వాడ, హైడ్రా అంటూ ఏడాది నుంచి మా మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు ఆరంభం మాత్రమే. నాలుగేండ్లలో ఎన్ని కేసులు పెట్టినా ఎదురొంటం. అక్రమ కేసులపై న్యాయవ్యవస్థ వద్దే తేల్చుకుంటం.
– కేటీఆర్
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్‌పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఆయ న జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా సిద్ధమేని స్పష్టంచేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, తనపై మోపిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనే కొట్లాడుతామని తేల్చిచెప్పారు. ఈ కేసులు ఆరంభం మాత్రమేనని, నాలుగేండ్లలో ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదురొంటామని, దేశానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు. ‘నిజాయితీకి ధైర్యం ఎకువ.. రోషంగల్ల తెలంగాణ బిడ్డగా ఏ విచారణనైనా ఎదురొనేందుకు సిద్ధం’ అని చెప్పారు. లాయర్లతో విచారణకు బుధవారం హైకోర్టు అనుమతిస్తే 9న ఏసీబీ విచారణకు లాయర్లతో వెళ్తానని తెలిపారు. 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని, వారు ఏమడిగినా సమాధానం చెప్తానని, దాపరికం లేదు.. దాయాల్సిందేమీ లేదని వెల్లడించారు.
హైకోర్టులో కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినందుకే కాంగ్రెస్ నాయకులు సంతోషపడుతున్నారని, వాళ్లే శిక్షలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫార్మూలా ఈ-కార్ రేసులో అరపైసా అవినీతి కూడా జరగలేదని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘50 లక్షలతో దొరికిన దొంగలకు ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారినట్టు అనిపిస్తుంది’ అని నిప్పులు చెరిగారు. ‘అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు అక్రమ కేసులు పెడితే.. న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎదురొనేందుకు నాకున్న ప్రతి హకును వినియోగించుకుంటా. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను విచారణకు హాజరయ్యా. కానీ లాయర్లతో రావద్దన్నరు. లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు మీడియాకు లీకులువదిలి సతాయించిండ్రు. అందుకే లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని బుధవారం హైకోర్టుకు వెళ్తున్న. ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టుకు వెళ్తున్న’ అని కేటీఆర్ తెలిపారు.
కక్ష సాధింపు కేసులు
‘నా మీద పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీలేని లొట్టపీసు కేసు. బట్టకాల్చి మీద వేసి ఏదో జరిగిందని చూపెట్టే కక్ష సాధింపు కేసు అని తెలిసీ ఏసీబీ విచారణకు వెళ్లిన. ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసినం. తప్పుడు ఎఫ్ఐఆర్, ఇష్టమొచ్చినట్టు సెక్షన్లు పెట్టారని వాదించినం. కానీ, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. దానికే కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషపడుతున్నరు. నాకేదో ఉరిశిక్ష వేసినట్టు, నేరారోపణ రుజువైనట్టు సంకలు గుద్దుకుంటున్నరు. నేను నేరం చేసినట్టు హైకోర్టు ఎకడా చెప్పలేదు. నాకు శిక్ష వేయలే దు. సామ్ జరిగినట్టు కూడా ఎకడా అనలేదు.. క్వాష్ పిటిషన్ కొట్టివేతపై సుప్రీంకోర్టుకు పో తం. న్యాయపోరాటం చేస్తం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
ప్రజా సమస్యలపై మీడియా దృష్టిపెట్టాలి
‘ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన రూ.2500, వృద్ధులకు ఇవ్వాల్సిన రూ.4000 ఎప్పుడిస్తరో? ఎలా ఇస్తరో? చెప్పాలని కాంగ్రెస్ నాయకులను నిలదీద్దాం. ఫార్ము లా కేసు విషయంలో మీడియా చేస్తున్న హడావుడికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగం కావద్దు. ఫార్ములా కేసు విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్న మీడియా.. ప్రజ లు పడుతున్న బాధలను చూపించడంలోనూ చూ పించాలి. హైడ్రా, మూసీ బాధితుల కష్టాలను మీడియాలో చూపించండి. ఆరు గ్యారెంటీల అమలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్‌రెడ్డి పడుతున్న పాట్లను కూడా అప్పుడప్పుడు చూపించండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు, ఉపాధి లేక చనిపోతున్న నేతన్నలు, గురుకులాల్లో అధ్వాన్న పరిస్థితుల మీద కూడా మీడియా దృష్టి పెట్టాలని కోరుతున్నాం’ అని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం చెప్తున్న అర్ధసత్యాలను ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని కోరారు.
ఆ పనులు క్విడ్ ప్రో కోతోనే ఇచ్చారా?
మల్లన్నసాగర్ పనులను కూడా మేఘా ఇంజినీరింగ్‌కి ఇవ్వబోతున్నట్టు సమాచారం ఉన్నదని, అది కూడా క్విడ్ ప్రో కోలో భాగంగానే ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును కూడా మేఘాకే ఇచ్చారని, ఇది కూడా క్విడ్ ప్రో కోలో భాగమేనా అని నిలదీశారు. ‘గ్రీన్కో కంపెనీ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లు అందుకోని రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉన్నదా? కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీకి కూడా గ్రీన్కో బాండ్ల రూపంలో విరాళాలిచ్చింది. ఒక బీఆర్ఎస్ పార్టీ మీదనే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఏడుస్తున్నరు?’ అని కేటీఆర్ నిలదీశారు.
తిరిగి అధికారంలోకి వస్తాం
‘అంబేదర్ రాజ్యాంగం ప్రకారం నాకు దకిన హకును నేను తప్పకుండా, విధిగా వాడుకుంట. నాకు భారత న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉన్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదు. కాంగ్రెస్‌కు రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తున్నది. గతంలో ఈ రెండు పార్టీలను చిత్తుచేసి అధికారంలోకి వచ్చాం. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనూ గెలుస్తాం. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి తిరిగి అధికారంలోకి వస్తం’ అని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌నాయక్, దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మెతుకు ఆనంద్, కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్ రూప్సింగ్ పాల్గొన్నారు.
అంతిమ విజయం ధర్మానిదే
‘నిజానికి ధైర్యమే కాదు బలమూ ఎక్కువే. ఎదురుదెబ్బలకు బెదిరేది లేదు. ఎదురుదెబ్బలను ఎదుర్కొని విజయబావుటాలమై తిరిగొస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. సత్యానికి పదునూ ఎక్కువేనని, అది కాలంతోపాటు వెలుగుతూనే ఉంటుందని మంగళవారం ఎక్స్‌వేదికగా వ్యాఖ్యలు చేశారు. ‘మీరు సృష్టిస్తున్న అబద్ధాలు ఎప్పటికీ నిజం కానేరవు. మీ వెకిలి మాటలు నా మనోైస్థెర్యాన్ని తగ్గించలేవు. మీ దృష్టిమరల్చే చర్యలు మా ప్రయాణాన్ని నిలువరించలేవు’ అని పేర్కొన్నారు. ‘న్యాయవ్యవస్థపై నాకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్నది. ధర్మం కోసం, న్యా యం కోసం నేను చేసే పోరాటాన్ని ఆపను. నిజం నిలకడ మీద తెలుస్తుంది’ అని స్పష్టం చేశారు.
మంత్రులే న్యాయమూర్తులైండ్రు
‘కొందరు మంత్రులు న్యాయమూర్తులై వాళ్లే శిక్షలు వేస్తున్నరు. మీడియాలోనో, సెక్రటేరియట్లోనో, మంత్రుల పేషీలోనో కాదు.. న్యాయస్థానాల్లోనే ట్రయల్ జరుగుతది. మళ్లీ చెప్తున్న రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకపోయేందుకు దేశంలోనే కాదు ప్రపంచపటంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసేందుకే ఈ- కార్ రేసు నిర్వహణపై నిర్ణయం తీసుకున్నం తప్ప ఏమీ ఆశించి కాదు. కాంగ్రెస్ నాయకులలా గా దివాలాకోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు’ ’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
వాళ్ల ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ.. మా ఇంట్రెస్ట్ ఫార్మర్
‘కాంగ్రెస్ నాయకుల ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ.. మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించి మాట్లాడుతం. డైవర్షన్ కోసం రేవంత్ ఏం చేస్తున్నరో మాకు తెలుసు. విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం చేయడం ఇదే కాంగ్రెస్ నైజం. రైతు భరోసా ఎప్పుడు వస్తదని 75 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నరు. కేసీఆర్ 12 సార్లు రైతుబంధు ఇస్తే.. రేవంత్ ఒకసారి కూడా ఇవ్వలేదు. రైతులకు న్యాయం జరిగేదాకా కొట్లాడాలని మా పార్టీ నాయకులకు చెప్పిన. అటెన్షన్ డైవర్షన్‌తో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయాలని చెప్పిన’ అని కేటీఆర్ పేర్కొన్నారు.