హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఆన్స్క్రీనా.. లేక మాన్యువల్గానా అన్న అంశానికి పుల్‌స్టాప్ పడింది. ఈ ఏడాది ఆన్‌స్క్రీన్ మూల్యాకంనం లేనట్టేనని ఇంటర్‌బోర్డు వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ఈ ఏడాది మూల్యాంకనం ఎప్పటిలాగే మాన్యువల్‌గానే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జవాబుపత్రాలను ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం చేయాలన్న బోర్డు ప్రయత్నాలకు నిరుడు బ్రేకులు పడగా, ఈసారి కూడా అదే పునరావృతమైంది.
ఇంటర్ జవాబుపత్రాలను మాన్యువల్‌గా కాకుండా, ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం చేయాలని 2022లో బోర్డు నిర్ణయం తీసుకొన్నది. ప్రయోగాత్మకంగా 2023 మార్చి వార్షిక పరీక్షల నుంచే ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. పలు కారణాలతో నిరుడు అమలు కాలేదు. ఈ ఏడాది మాన్యువల్‌గానే మూల్యాంకనం చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 9.5లక్షలకుపైగా అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. మార్చి మొదటి వారం నుంచే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభంకానున్నది.
ఇప్పటికే పాలిటెక్నిక్ కోర్సుల్లో, బీఆర్ అంబేద్కర్ వర్సిటీలో, ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీల్లో, జేఎన్టీయూలో ఆన్‌స్క్రీన్ మూల్యాంకనాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నారు. ఇంటర్‌బోర్డు సెక్రటరీగా పనిచేసిన నవీన్‌మిత్తల్ ఈ ప్రయోగాత్మక విధానాన్ని అమలుచేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. ఇంటర్‌బోర్డు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. 2023లో 35 లక్షలు, 2024లో 45లక్షలు, 2025లో 55 లక్షల చొప్పున ఇంటర్ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్లను స్కాన్‌చేయడం, బార్కోడ్ కేటాయించడం వంటి పనులు చేపట్టేందుకు 2023 జనవరిలో బోర్డు అధికారులు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించారు. పలు కారణాలతో ఈ టెండర్లు రద్దయ్యాయి.