ED Raids | హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపనున్న విషయంలోపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందే సమాచారం అందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ అధికారులు వస్తున్నారని తెలిసి ముందే జాగ్రత్తపడ్డారని తెలుస్తున్నది. శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు పొంగులేటి నివాసం, కార్యాలయాలకు చేరకముందే కీలక డాక్యుమెంట్లను పొంగులేటి కార్యాలయాల నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ సీపీయూలు, హార్డ్ డిస్కులు మాయం చేశారని తెలుస్తున్నది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రాఘవ టవర్స్‌లో పొంగులేటికి చెందిన నిర్మాణ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆయన వ్యాపార సామ్రా జ్యం మొత్తం ఈ భవనం నుంచే పని చేస్తుంది. అయితే, శుక్రవారం ఈడీ అధికారులు రంగంలోకి దిగే ముందే కొందరు వ్యక్తులు రాఘవ టవర్స్ వద్దకు చేరుకున్నారని తెలుస్తున్నది.
ముందు సెల్లార్‌కు.. అక్కడి నుంచి సేఫ్ ప్లేస్‌కు..
ఈ భవనానికి కొంత దూరంలో కార్లను నిలిపి, రాఘవ సంస్థ కార్యాలయంలోకి చేరుకున్నట్టు సమాచారం. ముందుగా పదుల సంఖ్యలో సంచులను భవనం సెల్లార్లోకి తీసుకొచ్చారని, అక్కడి నుంచి క్షణాల్లో వాటిని కార్లలో నింపి ‘సేఫ్’ ప్లేస్‌లకు తరలించినట్టు తెలుస్తున్నది. నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో సంచులు కార్యాలయం నుంచి బయటపడ్డాయని సమాచారం. వీటిల్లో పొంగులేటి వ్యాపారాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సీపీయూలు, హార్డ్ డిస్క్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. భారీగా నగదు సైతం ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని తరలించింది మంత్రి అనుచరులు, ఆయన వ్యాపార సంస్థల్లో పని చేసే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అని తెలుస్తున్నది. అయితే, పొంగులేటి సంస్థల్లో కీలక అధికారులు కొద్ది దూరంలో ఉండి ఆదేశాలు ఇస్తూ తరలింపు పనికి పురమాయించినట్టు అనుమానాలు ఉన్నాయి.