– ఎంజీయూ ఆంగ్ల అధ్యాపకుడు డా.సిహెచ్.శ్యాంసుందర్
రామగిరి, ఫిబ్రవరి 23 : నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించడం అనివార్యమని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకుడు డా. సిహెచ్. శ్యాంసుందర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో “పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష ప్రాధాన్యత” అంశంపై నిర్వహించిన అతిథి ఉపన్యాసంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందిన ఆంగ్లానికి నేటి విద్యా, ఉపాధి రంగాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూల్లో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది భాషా ప్రావీణ్యమేనన్నారు. పద సంపద పెంపు, వ్యాకరణంపై పట్టు, కమ్యూనికేషన్ నైపుణ్యాల సాధన ద్వారా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ.. ఆంగ్ల భాషలో నైపుణ్యం ఉన్నవారికి దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు నిరంతర సాధనతో భాషా దిట్టలుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డా.ఎం.లక్ష్మీ నీలిమ, అధ్యాపకురాలు రాధికతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు అనివార్యం’