హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ప్లాంటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టంచేశారు. కొద్ది రోజులు ఆలస్యమవుతుంది తప్ప ప్లాంటు ఏర్పాటు ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్లాంటును అడ్డుకునేందుకు రైతులను, స్థానికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇటీవల పెద్ద ధన్వాడలో ఇథనాల్ ప్లాంటు ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడుల అంశంపై సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇథనాల్ ప్లాంటు ఏర్పాటు తథ్యమని చెప్పారు.
సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే సంప్రదాయేతర ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తున్నదని, ఇందులో భాగంగా ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు సమర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇథనాల్ ప్లాంటుతో కాలుష్యం ఏర్పడే అవకాశమే లేదని, అది అత్యాధునిక పద్ధతుల్లో నిర్మిస్తారని చెప్పారు. ప్లాంటుకు సంబంధించిన అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామని, వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రైతులు, విలేకరులపై కేసులు నమోదు చేసిన అంశంపై మంత్రి మాట్లాడుతూ దీని వెనుక రాజకీయ ఎజెండా ఏమీ లేదని, చట్టాన్ని ఉల్లంఘించనవారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ఇథనాల్ ప్లాంటు అంశాన్ని రాజకీయం చేయవద్దని, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తిచేశారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకున్న అనేక నిర్ణయాలకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందని, పారిశ్రామికీకరణను అడ్డుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఇథనాల్ ప్లాంట్లను వ్యతిరేకించినట్టు విలేకరులు గుర్తుచేయగా, తాము కాలంచెల్లిన టెక్నాలజీతో ఏర్పాటుచేసే ఇథనాల్ ప్లాంట్లను మాత్రమే వ్యతిరేకించామని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్లాంట్లను కాదని మంత్రి సమర్థించుకున్నారు. పెద్ద ధన్వాడలో ఇప్పటికీ పోలీస్ పికెట్ కొనసాగుతున్నది. గ్రామస్థులను కలిసేందుకు ఎవరైనా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సోమవారం గ్రామస్థులను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు మధ్యలోనే అడ్డుకొని అరెస్టు చేశారు.