Etela Rajender | బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికనున రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులను తామే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు.
రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేను ఇప్పటికే సర్వేలు చేశాం.. మా అభ్యర్థులను మేమే నిర్ణయిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో తనకు ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. పార్టీ నిర్ణయాల్లో నాకు కనీసం సమాచారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ నేతగా తనకు ఒక గుర్తింపు ఉందని.. బీజేపీ దాన్ని కాపాడుకోవాలని ఈటల రాజేందర్ సూచించారు. సోషల్ మీడియాలో నాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ వెనకాల బీజేపీ పార్టీ నేతలే ఉన్నారని తెలిపారు. సొంత పార్టీ నేతలే నాపై నెగెటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుల ముందే ఈటల రాజేందర్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.