హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 7: కులపోళ్లు.. బంధువులను సైతం ఈటల ఇబ్బందులు పెట్టారని, కేసు పెట్టి బెదిరించారని కమలాపూర్‌కు చెందిన ఆయన బంధువులు, గ్రామస్థులు పేర్కొన్నారు. గురువారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ బంధువులు, కమలాపూర్ గ్రామస్థులు 50 మంది టీఆర్ఎస్లో చేశారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మంత్రికి తమ గోడును చెప్పుకున్నారు. ఈటలతో పైరవీలు చేసుకున్నవారు కోట్లకు ఎదిగారని, ఆయన తమను ఏనాడూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈటల సోదరి తమ మత్స్యకారుల సంఘ భవనానికి తాళం వేశారని, తమ ఇంట్లో పురుషులపై కేసులు పెట్టి వేధించారని వాపోయారు. ఈటల తమను ఏనాడూ ఆదరించలేదని చెప్పారు. తాము ఈటల వీధిలోనే నివాసం ఉంటామని తమ బాగోగులు పట్టించుకోకపోగా, తమపై కేసులు పెట్టి వేధించారని తెలిపారు. ఇంత దగ్గరి వాళ్లమైనా తమకు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని, ఏ కష్టమొచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లందకుంటకు చెందిన రజక సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కొండపాక ఎంపీపీ దుర్గయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.