హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : పరిపాలన చేతకాకుంటే సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం తలదించుకుంటున్నదని, దేశం ముందు మన పరువుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గత పదేండ్లలో వరి ఉత్పత్తి, జీఎస్టీ వృద్ధి, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచిందని ఈటల స్పష్టంచేశారు.
అనేక రాష్ర్టాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో రాష్ట్రం ముందుకు సాగిందని గుర్తుచేశారు. నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ర్టానికి రూ.3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి దివాలా తీసిందని సీఎం అనడం ఏమిటని మండిపడ్డారు. ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగులను దోషిగా నిలబట్టే ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏలు చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు.