హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, నీటి వినియోగ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేస్తూ మం గళవారం మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నీటి సంరక్షణపై చర్యలు తీసుకోవాలని మార్చి 13న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి కమిటీ ప్రధానంగా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలను రూపొందించాలని, నీటి సంరక్షణ చట్టాలను బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వరంగ నీటి సంరక్షణ సంస్థలో సమన్వయం చేసుకొని వారి సాంకేతిక, ఆర్థిక సహకారం తీసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణపై నిత్యం పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్, జిల్లా, జీహెచ్ఎంసీ స్థాయి కమిటీలపై సమీక్ష చేయాలని తెలిపారు. జీహెచ్ఎంసీ స్థాయి కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదికను అందించాల్సి ఉంటుందన్నారు.