హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యారంగానికి ప్రభుత్వం విశేష ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ మేరకు ఎన్నో నూతన కళాశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు మంజూరు కావాలంటే దశాబ్దాలు గడిచేది. నేడు ఎవరూ అడగకపోయినా విద్యార్థుల సంఖ్యను బట్టి కొత్త కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఈ దశలో ఇటీవలి కాలంలో 23 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 20 పాలిటెక్నిక్, 14 జూనియర్ కాలేజీలు, 4 జేఎన్టీయూ కాలేజీలను ప్రభుత్వం మంజూరుచేసింది. విద్యను ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవడం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం కాగా, విద్యను సార్వత్రీకరించి అందరికీ అందుబాటులో ఉంచడం రాష్ట్ర ప్రభుత్వ విధానంగా మారింది.
61కి చేరిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల సంఖ్య
ప్రభుత్వం ఇటీవలే 20 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను కొత్తగా నెలకొల్పింది. దీంతో ఆ కాలేజీల సంఖ్య 61కి చేరింది. 2014-2022 వరకు 13 కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయగా, 2022-23 కాలంలో మహేశ్వరం, మణుగూరు కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే పటాన్చెరు, ముషీరాబాద్, ఆమనగల్లు, షాద్‌నగర్, సత్తుపల్లికి కాలేజీలు మంజూరయ్యాయి.
నాలుగు జేఎన్టీయూ కళాశాలలు
జేఎన్టీయూ చదువులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంలో భాగంగా ప్రభుత్వం కొత్తగా నాలుగు జేఎన్టీయూ కాలేజీలను నెలకొల్పింది. కొత్తగా సిరిసిల్ల, వనపర్తి, పాలేరు, మహబూబాబాద్‌లో కొత్త కాలేజీలను నెలకొల్పింది. సుల్తాన్పూర్ క్యాంపస్‌ను ఫార్మాస్యూటికల్ సైన్స్‌గా అభివృద్ధి చేసింది.
నియోజకవర్గానికో డిగ్రీ కాలేజీ
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గానికో డిగ్రీ కాలేజీ చొప్పున ఏర్పాటయ్యాయి. గత తొమ్మిదిన్నరేండ్లల్లో 23 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటికి 70కి పైగా గురుకుల డిగ్రీ కాలేజీలు అదనం. డిచ్పల్లి, బాల్కొండ డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య 141కి చేరింది.