యాదాద్రి, మార్చి 19: యాదాద్రి నూతనాలయం ఈ నెల 28న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పార్లమెంట్ తరహాలో స్మార్ట్‌సిటీ టెక్నాలజీతో భద్రతా వ్యవస్థను నెలకొల్పనున్నారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంటుంది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన సాంకేతికత, కెమెరాలు, లైటింగ్, ఫెన్సింగ్, బాంబు డిటెక్టర్లు, బాంబు స్కానర్లు వినియోగించనున్నారు. పార్లమెంటులో భద్రత్యను పర్యవేక్షించే ఈసీఐఎల్ కంపెనీకి ఈ బాధ్యతలను అప్పగించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో ఎన్ గీత, వివిధ శాఖల అధికారులతో కలిసి శనివారం భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన అధునాతన విద్యుద్దీపాలను యాదాద్రి పరిసర ప్రాంతాల్లో, రాయగిరి నుంచి స్వామివారి వైకుంఠ ద్వారం, టెంపుల్ సిటీ, రింగురోడ్డుతోపాటు గుట్ట చుట్టూ సుమారు 5.7 కిలోమీటర్ల మేర బిగించనున్నారు. ఇందులో సీసీ కెమెరాతోపాటు సౌండ్ సిస్టం సైతం ఉంటుంది.
ఈ లైట్లు సాయంత్రం కాగానే వాటంతటవే వెలుగుతాయి. ఉదయం సూర్యోదయం సమయంలో ఆఫ్ అయిపోతాయి. గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రాంతంలో అధునాతన ఫెన్సింగ్ నెలకొల్పనున్నారు. యాదాద్రికి వచ్చే జనసందోహంపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. లగేజీ, వాహనాల్లో బాంబు, ఇతర పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు అత్యాధునిక పరికరాలు, లగేజీ, వాహనం స్కానర్లు, ఫ్లాట్ బారియర్స్, డీఎఫ్ఎండీలను అమర్చనున్నారు. తిరుమల తరహాలో భక్తులకు ఆన్లైన్ ద్వారా టికెట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి భక్తుడు క్యూఆర్ కోడ్‌తో దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఉన్నవారికే కొండపైకి అనుమతి ఉంటుంది. రాయగిరితోపాటు యాదాద్రి ఆలయం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతోపాటు భద్రత వ్యవస్థను పర్యవేక్షించేందుకు యాదాద్రి కొండపైన ప్రత్యేకమైన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రిలో ప్రతి పరికరం ఇజ్రాయెల్, జర్మనీలో తయారు చేసినవే వినియోగించనున్నారు. యాదాద్రిలో 24 గంటలపాటు డీసీపీ స్థాయి భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.