పేద ప్రజల మేలు కోసమే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని నల్లకుంట డివిజన్ రత్న నగర్ లో, అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన లను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను బస్తీ దవాఖానల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం 160 కి పైగా బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.500 నుంచి 10 వేల రూపాయల వరకు విలువైన 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని, 24 గంటల్లో పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ లను అందజేస్తున్నట్లు చెప్పారు.
చిన్న చిన్న వైద్య సేవలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి వేలాది రూపాయలను ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లలో అన్ని రకాల సౌకర్యాలు, వసతులను కల్పించినట్లు తెలిపారు.
అలాగే కోట్లాది రూపాయల వ్యయంతో అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశామని, లక్షల రూపాయల విలువైన వివిధ రకాల ఆపరేషన్ లను కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.