హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు మొత్తం 11 విభాగాల్లో పరీక్ష జరిగింది.
ఈ పరీక్షకు మొత్తం 23, 330 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 22,365 (95.86శాతం) మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. జూన్ రెండోవారంలో వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఎస్కే మహమూద్, వీ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఓయూ వీసీ డీ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ఉద్యోగికి మొదటిర్యాంకు
పెద్దపల్లి జిల్లాకు చెందిన మొండయ్య బీఎస్సీ గణితం విభాగంలో 96 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. ప్రస్తుతం 35 ఏండ్లున్న ఈయన సింగరేణిలో ఉద్యో గి. ఈసెట్‌లో క్వాలిఫై అవుతాననుకున్నా కానీ.. మొదటిర్యాంక్ వస్తుందని ఊహించలేదని తెలిపాడు. బీటెక్ మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరుతానని చెప్పాడు.