హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తుతూ పార్టీలో ప్రతిష్ట పెంచుకునేందుకే సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంసృతితో ఎలాంటి సంబంధంలేని రాజీవ్ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని పెట్టి పరోక్షంగా ఆయనను కూడా రేవంత్ అవమానించాడని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఆమె మెప్పుకోసం రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసే ఎత్తుగడవేశారని ఆరోపించారు. ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ ఏర్పాటు చేయలేదు అంటున్న ముఖ్యమంత్రీ.. స్వరాష్ట్ర ఉద్యమం నుంచి ప్రతి గ్రామం, ప్రతి రాస్తాలో మేం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినం’ అని గుర్తుచేశారు. ఉమ్మడి పాలన ముగిసిన సందర్భంగా తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించాలనుకున్నామని, ఇందుకు ప్రణాళికలు కూడా పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా రాజీవ్‌గాంధీ విగ్రహం తెలంగాణ ప్రజల కండ్లలో నలుసులా మిగిలిపోతుందని ఎద్దేవాచేశారు.