హైదరాబాద్, జూన్ 26 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండు కమిటీలు ఉన్నాయని, ఒకటి మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే, మరొకటి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని అబద్ధాల ప్రచార కమిటీ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. అబద్ధాల కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్‌రెడ్డి అని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు మన్నె గోవర్ధన్, గోసుల శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు, కిశోర్‌గౌడ్, కరాటే రాజు, సుమిత్రా ఆనంద్‌తో కలిసి ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ విధ్వంసపూరిత విధానాలతో పాలనా సంక్షోభం నెలకొన్నదని దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకుండా ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వీరంతా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఫంక్షన్లో జై తెలంగాణ అని నినదించిన సినీనటులు బాలకృష్ణ, అల్లు అర్జున్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. బనకచర్లకు హారతులు పడుతూ చంద్రబాబుకు దాసోహమంటున్న రేవంత్‌రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి రెండు హైకమాండ్లు ఉన్నాయని ఒకటి ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నేతృత్వంలో అయితే, మరొకటి ఆంధ్రాలో చంద్రబాబు నాయకత్వంలో అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పెద్దలు ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని విరుకుకుపడ్డారు.
తెలంగాణను సాధించిన కేసీఆర్, ఉద్యమంలో కొట్లాడిన హరీశ్‌రావు, కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప.. సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టులేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. నోటికొచ్చినట్టు దూషిస్తే బీఆర్ఎస్ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేసీఆర్ పదేండ్లలో ఉద్ధరించిందేమీ లేదంటున్న రేవంత్‌రెడ్డి… కేసీఆర్ కట్టించిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎలా కూర్చుంటున్నారని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి అసలైన చీఫ్ మినిస్టర్ కాదని, డిప్యూటేషన్ చీఫ్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి.. అవకాశం కోసం మరోపార్టీలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బహిరంగ చర్చకు రావాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ సవాల్ విసిరారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.