చెన్నూర్ రూరల్/కాసిపేట, ఏప్రిల్ 28 : ఇండ్లు, భూములు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు రాసిండ్రని మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి గ్రామస్థులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆం దోళన చేపట్టారు. 130 మంది దరఖాస్తు చేసుకుంటే.. అందులో వాళ్లకు నచ్చిన కాం గ్రెస్ నాయకులు, బంధువులను 35 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలతో అసలైనవారికి ఇండ్లు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకులు చెప్పినోళ్లకేనా.. మాలాంటి పేదోళ్లకు ఇవ్వరా’ అంటూ కాసిపేట మండలం లంబాడీతండా(ధర్మారావుపేట) వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం గ్రామానికి వచ్చిన అధికారులను మహిళలు, గ్రామస్థులు అడ్డుకొని నిలదీశారు.