తొర్రూరు, ఫిబ్రవరి 13: రాష్ట్ర సర్కార్‌పై 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారంతా కాంగ్రెస్ సర్కార్‌ను కూలగొట్టడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు శ్రీనివాస గార్డెన్స్‌లో గురువారం బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ పాలనలో అట్టర్‌ఫ్లాప్ అయిందని విమర్శించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటనను సీఎం రేవంత్‌రెడ్డే అడ్డకున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి దళారీలా పని చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ముగ్గురు సీఎంలు ఉన్నారని, ఒకరు పొంగులేటి, మరొకరు కోమటిరెడ్డి, మరొకరు భట్టి అని విమర్శించారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని తెలిపారు. సమావేశంలో మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, నాయకులు పొనుగంటి సోమేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, పట్టణ అధ్యక్షు డు బిందు శ్రీనివాస్ పాల్గొన్నారు.