కాశీబుగ్గ, మే 4 : రైతులు పండించిన మక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతులే క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలను నిర్వహించాలని సవాల్ విసిరారు. సోమవారం బీఆర్ఎస్ బృందంతో కలిసి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, క్రయ విక్రయాల తీరును పరిశీలించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ మార్కెట్లలో రైతు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడమే కాకుండా అవసరమైన పథకాలు, ఇతర రాయితీలు అందించినట్టు చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని రైతులు చెంపలు వేసుకుంటున్నారని తెలిపారు. మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గన్నీ బ్యాగులు ఇవ్వకుండా, కాంటాలైన బస్తాలు తరలించకుండా కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
మక్కల కొనుగోలులో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నట్టు తెలిపారు. రాహుల్‌గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఈ నెల 6నాటికి నాలుగేండ్లు పూర్తవుతున్నా ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ కాలేదని, రైతు భరోసాను ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా మక్కలు కొనడం లేదని, దీంతో రైతులు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 6న హనుమకొండలో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎర్రబెల్లి రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మార్క్‌ఫెడ్ మక్కలు కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్నదని, దీంతో రైతులు 25 రోజులుగా మార్కెట్లో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎకరానికి 26 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారని, ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1,800 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 6న బీఆర్ఎస్ నిర్వహించే రైతు సంగ్రామ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.