తెలంగాణ రాష్ట్రం వరసగా రెండోసారి కూడా నేషనల్ లీడ్ స్టేట్‌గా నిలువడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ శాఖ ఆడిటింగ్‌లో తెలంగాణ.. దేశంలో మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్‌లు ఉన్న తెలంగాణ రాష్ట్రం వరసగా రెండోసారి కూడా నేషనల్ లీడ్ స్టేట్‌గా నిలువడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో 100 శాతం ఆడిట్ సాధించిన మొదటి రాష్ట్రంగా ఉండడం వెనుక రాష్ట్ర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఉందని పేర్కొన్నారు. దేశంలోనే ఆడిటింగ్‌లో మొదటి స్థానం రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం ఉందన్నారు. ట్విటర్ వేదికగా అభినందించిన మంత్రి కేటీఆర్‌కు ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు, అవార్డులు ఇచ్చినట్లే నిధులు కూడా ఇవ్వాలని కోరారు. ఈ ర్యాంకు వచ్చేందుకు కృషి చేసిన గ్రామ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందనలు తెలిపారు.