దేవరుప్పుల, జనవరి 23 : పాలన గాలికొదిలి ప్రతిపక్ష నేతలకు నోటీసులిస్తూ కాంగ్రెస్ సర్కార్ నాటకాలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. సిట్ విచారణకు హాజరైన కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గపు పాలనను అడుగడుగునా ఎత్తిచూపుతున్న కేటీఆర్, హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ.. ఏదో ఒక నెపంతో విచారణలకు పిలువడం, కేసులు పెట్టడం సర్కార్‌కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బొగ్గు స్కామ్‌ను బహిర్గతం చేసిన బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి కక్ష కట్టారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్‌లో పసలేదని అత్యున్నత న్యాయస్థానమే తెలిపిందని, అయినా బీఆర్ఎస్ నేతలకు నోటీసులిచ్చి విచారణకు పిలువడం ప్రజల దృష్టిని మరల్చేందుకేనని విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారని ఎర్రబెల్లి గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, ఆ పార్టీ నాయకులు చేసే స్కామ్‌లను అడుగడుగునా నిలదీస్తున్న ప్రతిపక్షనేతలపై కేసులు పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న సర్కార్ తీరును ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు.
ప్రభుత్వానిది కక్షసాధింపు: జీవన్‌రెడ్డి
ఆర్మూర్‌టౌన్, జనవరి 23 : కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సిట్ పేరిట విచారణకు పిలిచి కక్ష సాధిస్తున్నదని మండిపడ్డారు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అరాచకాలను సాగనివ్వబోమని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ దమననీతిని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో శుక్రవారం జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తాటాకుచప్పుళ్లకు భయపడమని, రేవంత్‌రెడ్డి సాగిస్తున్న రాక్షస సర్కార్‌పై తిరుగబడతామని హెచ్చరించారు.
నోటీసులు మున్సిపల్ ఎన్నికల స్టంటే : ఆల
కొత్తకోట, జనవరి 23 : మున్సిపల్ ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సిట్ విచారణ పేరుతో కేటీఆర్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులను నిరసిస్తూ శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆల భారీ బైక్‌ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం కేటీఆర్‌ను సిట్ విచారణకు ఆదేశించిందని, ఇలాంటి నోటీసులు, కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు.
కాగజ్‌నగర్‌లో ధర్నా
కాగజ్‌నగర్, జనవరి 23 : కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ ద్వారా నోటీసులిచ్చారని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్‌రావు, నాయకులు గోలం వెంకటేశ్, కొంగ సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని తెలంగాణ తల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలు, హామీల వైఫల్యాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని మండిపడ్డారు.
తిట్లతో రేవంత్ శునకానందం: పువ్వాడ
వైరాటౌన్, జనవరి 23 : బొగ్గు కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయా లు చేస్తున్నదని, బీఆర్ఎస్ నేత లపై అక్రమ కేసులు బనాయి స్తూ సిట్ పేరుతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ తప్పుదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్ తన స్థాయి మరిచి తిట్లదండకంతో శునకానందం పొందుతున్నారని మం డిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా వైరాలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రెండేండ్లు దాటినా ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేయలేదని, బీఆర్ఎస్ నేతల పై అక్రమ కేసులు బనాయించడం పనిగా పెట్టుకున్నదని పువ్వాడ మండిపడ్డారు.
గట్టులో బీఆర్ఎస్ నేతల అరెస్టు
గట్టు, జనవరి 23 : సిట్ పేరుతో కేటీఆర్ విచారణకు వ్యతిరేకంగా హైదరాబాద్ వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో బీఆర్ఎస్ నేత అంగడి బసవరాజ్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్న నాయకులు రామునాయుడు, వెంకటేశ్, కృష్ణ, రవి, తిమ్మప్ప, ఆంజనేయులు, నాగరాజు, ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.