కాశీబుగ్గ, ఏప్రిల్ 23 : కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి గద్దె నెక్కిందని, తొందరలోనే ప్రజలు తగిన బుద్ధిచెప్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం వరంగల్‌లోని 3వ డివిజన్ ఆరెపల్లిలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలకు చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. సర్కార్‌పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ విజయం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌తో అభివృద్ధి శూన్యమని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు.
కోస్గి, ఏప్రిల్ 23 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం గుండుమాల్ మండలకేంద్రంలో కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించే రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.