కొడకండ్ల, జూన్ 12 : ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురంలోని తిరుమల సాయి రైస్‌మిల్లు ఎదుట ఏడునూతుల గ్రామ రైతులు వడ్ల లోడు వాహనాలతో రోజుల తరబడి రోడ్డుపైనే నిరీక్షిస్తుండగా శుక్రవారం అటుగా వెళ్తున్న ఎర్రబెల్లి వాహనాన్ని రైతులు ఆపి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు విన్న ఆయన రైస్ మిల్లును సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాంటా వేయడంలో, లారీల నుంచి గోదాములకు తరలించడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదని మండిపడ్డారు. సుమారు 100కుపైగా వాహనాలతో రైతులు రోజుల తరబడి రోడ్డుపైనే వేచిచూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
‘బస్తాలు మావే.. హమాలీ ఖర్చులు మావే.. లారీల కొరతతో ట్రాక్టర్ల కిరాయిలు భరించలేక చస్తున్నాం.. అయినా మా పంటను కొనే నాథుడే లేడు’ అని రైతులు కన్నీరు పెట్టుకున్న వైనాన్ని ఎర్రబెల్లి వివరించారు. ఎండల తీవ్రతకు రైతులు పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కరోనా వంటి విపతర పరిస్థితుల్లోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోగా, కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదని మండిపడ్డారు. రైతుభరోసాను సకాలంలో ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఇప్పుడు కొనుగోళ్లు నిలిపివేసి కాంగ్రెస్ సర్కార్ తన రైతు వ్యతిరేక నైజాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం మెడలు వంచైనా సరే, ప్రతి గింజా కొనే వరకు బీఆర్ఎస్ నిలబడి పోరాడుతుందని తెలిపారు.