అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై పలు దఫాలుగా దిగుమతి సుంకాలను ప్రకటిస్తూ, వాటినే తన విదేశాంగ, వాణిజ్య వ్యూహాల్లో కీలక సాధనంగా మలుచుకుంటున్నారు. ఇటీవల కాలంలో భారత్, కెనడా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మెక్సికో వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన సుంకాలు, సుంకాల హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లను అనిశ్చితికి గురిచేశాయి. అసలు దిగుమతి సుంకాలు ఇంతటి ప్రభావం చూపగలవా? ఒకప్పుడు ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగపడిన ఈ ఆర్థిక సాధనం, నేడు దేశాల పారిశ్రామిక విధానాలు, దౌత్య సంబంధాలు, భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధంగా ఎలా రూపాంతరం చెందింది?
వాస్తవానికి దిగుమతి సుంకాలను ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగించే విధానానికి కొన్ని వేల ఏండ్ల చరిత్ర ఉన్నది. క్రీ.పూ. నాలుగో శతాబ్దంలోనే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ‘శుల్కాలను’ (దిగుమతిఎగుమతి సుంకాలు) ఆదాయ వనరులుగా మాత్రమే కాకుండా, రాజ్య ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే విధాన సాధనాలుగా కూడా వర్ణించాడు. అమెరికా ఆర్థిక చరిత్రలో కూడా ఇందుకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. 1930లో అమల్లోకి వచ్చిన స్మూట్హాలీ సుంకాల చట్టం, దేశీయ పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో వేలాది దిగుమతి వస్తువులపై సుంకాలను భారీగా పెంచింది. 1971లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చెల్లింపుల సమతుల్యత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తాత్కాలిక దిగుమతి సుంకాలను విధించాడు. 1980లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జపాన్ నుంచి వచ్చే ఆటోమొబైళ్లు, సెమీకండక్టర్ ఉత్పత్తులపై రక్షణాత్మక సుంకాలను విధించాడు.
ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో చైనాపై విధించిన అనేక సుంకాలను ఆ తర్వాత వచ్చిన అధ్యక్షుడు జో బైడెన్ పూర్తిగా ఉపసంహరించకపోవడం కూడా, దిగుమతి సుంకాలను ఆర్థిక, పారిశ్రామిక, వ్యూహాత్మక విధానాల్లో వినియోగించే అమెరికా దీర్ఘకాల దృక్పథానికి నిదర్శనం. అయితే, దిగుమతి సుంకాలను దౌత్య, వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా అత్యంత విస్తృత స్థాయిలో వినియోగిస్తున్న నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. అందుకే ఆయన ప్రతీ సుంకాల ప్రకటన పతాక శీర్షికగా మారుతున్నది.
దిగుమతి సుంకాల విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ లక్ష్యాన్ని సాధించే విస్తృత పారిశ్రామిక వ్యూహంలో భాగంగా చెప్తున్నది. గత కొన్ని దశాబ్దాలుగా విదేశాలకు తరలిపోయిన తయారీ పరిశ్రమలను మళ్లీ అమెరికాకు తీసుకురావడం, దేశీయ తయారీ రంగాన్ని పునరుజ్జీవింపజేయడం, ఉపాధి అవకాశాలను పెంచడం ఈ విధానంలోని ప్రధాన ప్రకటిత లక్ష్యాలు. అదే సమయంలో కొండలా పేరుకుపోతున్న వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికా ఉత్పత్తులకు ఇతర దేశాల్లో ఎదురవుతున్న అసమాన సుంకాలకు ‘పరస్పర సుంకాల’ ద్వారా దీటుగా ప్రతిస్పందించడం, బాలకార్మికులు, బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను నిరుత్సాహపరచడం కూడా ట్రంప్ ప్రభుత్వం తన సుంకాల విధానం లక్ష్యాలుగా పేర్కొంటున్నది. అయితే, ప్రకటిత లక్ష్యాల వెనుక మరో విస్తృత వ్యూహం కూడా ఉన్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరస్పర సుంకాల వివాదంతో ప్రారంభమైన ఒత్తిడి..మార్కెట్ ప్రాప్యత, వ్యవసాయోత్పత్తులు, వైద్య పరికరాలు, డిజిటల్ వాణిజ్యానికి సంబంధించిన అమెరికా అభ్యంతరాల వరకూ విస్తరించింది. తదనంతరం బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులపై అమెరికా ఆందోళనలు, తాజాగా రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు వంటివి కూడా సుంకాల విధానంతో ముడిపడి ఉన్నాయి. ట్రంప్ సుంకాల విధానానికి ప్రపంచ దేశాలు పలు రకాలుగా స్పందిస్తున్నాయి. కెనడా, బ్రెజిల్ వంటి దేశాలు అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించాయి. యూరోపియన్ యూనియన్, మెక్సికో వంటి దేశాలు చర్చల ద్వారానే పరిష్కారం కోరుతున్నాయి. భారత్ సహా అనేక ఆసియా దేశాలు ప్రపంచ సరఫరా వ్యవస్థలపై వీటి ప్రభావాన్ని నిశితంగా గమనిస్తూ, తమ వ్యూహాలను ఆచితూచి రూపొందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’ను కూడా కొత్తకోణంలో చూడాల్సిన అవసరం ఉన్నది. అది కేవలం దేశీయ తయారీని పెంచే లక్ష్యానికే పరిమితం కాకూడదు. భారత ఉత్పత్తులు ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో సులభంగా ప్రత్యామ్నాయం లభించని, అత్యంత విశ్వసనీయమైన స్థాయికి చేరుకునే జాతీయ వ్యూహంగా మేక్ ఇన్ ఇండియా రూపుదిద్దుకోవాలి.
మరో ప్రమాదం.. ఒకే దేశం లేదా ఒకే ప్రాంతంపై ఆధారపడే ఎగుమతులు, ఇంధన వనరులు, ముడిసరుకు సరఫరా వ్యూహాత్మక సుంకాల యుగంలో ప్రమాదకరంగా మారుతున్నాయి. అందువల్ల వీటిని విస్తృతంగా వికేంద్రీకరించాలి. అప్పుడు ఏకపక్షంగా విధించే సుంకాలు లేదా ఆంక్షల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అనివార్యమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ఎగుమతి మా ర్కెట్లను విస్తరించడం, దేశీయ మార్కెట్‌ను మరిం త బలోపేతం చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన తయారీ వ్యవస్థను నిర్మించ డం ద్వారా అవసరమైతే తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు సుంకాలను కూడా సమర్థంగా విధించగల ఆర్థిక సామర్థ్యాన్ని పెం పొందించుకోవడమే. కొన్ని సందర్భాల్లో ‘ఎదురుదాడే సమర్థవంతమైన ఆత్మరక్షణ’ అవుతుంది.