ఖైరతాబాద్, నవంబర్ 1: రాష్ట్ర కాంగ్రెస్‌లో బీసీ నేతలకు రేవంత్ మొండి ‘చేయి’ చూపారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి నేత ఈర్ల కొమురయ్య విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీకి, తన సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మొత్తం అగ్రవర్ణాల పార్టీగా మారిపోయిందని మండిపడ్డారు. అభ్యర్థిత్వం కోసం దరఖాస్తుకు రూ.50 వేల చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేశారని, దీనికి తోడు కోట్లు చెల్లించిన వారికే టికెట్లు ఇచ్చారని విమర్శించారు. దీనికి బదులు టెండర్లు పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నారని, ఇప్పటికే అనేక మంది పార్టీని వదిలి వెళ్లిపోయారని తెలిపారు. సునీల్ కనుగోలుతో దొంగ సర్వేలు చేయించి డబ్బులెక్కువ ఇచ్చిన వారికే టికెట్లు కేటాయించారని ధ్వజమెత్తారు. టీడీపీ నుంచి నాయకులను డంప్ చేసుకొని వారికి టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. దీనిపై సీనియర్లు ప్రశ్నిస్తే ఉంటే ఉండండి లేకపోతే పోండని ముఖం మీదే చెబుతూ దబాయిస్తున్నాడని తెలిపారు. ఇటువంటి పీసీసీ అధ్యక్షుడిని తన జీవతంలో చూడలేదని, రేవంత్ కాంగ్రెస్‌కు పట్టిన దరిద్రమని విమర్శించారు. రేవంత్ వల్లే కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తున్నదని కన్నీటి పర్యంతమయ్యారు.