Erik Solheim | స్వయంగా ముఖ్యమంత్రి పచ్చదనంపై దృష్టి పెట్టడం శుభపరిణామమని ప్రముఖ పర్యావరణవేత్త, గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణకు హరితహారం అమలు, విజయవంతంగా అమలు ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా హరితహారం స్ఫూర్తితో పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్నఆయన కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను, దూలపల్లిలో అటవీ శాఖ నర్సరీని సందర్శించారు. ఆ తర్వాత అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (FCA) ఎంసీ పర్గెయిన్తో సమావేశం అయ్యారు.
తాను గతంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేసిన సమయంలో తెలంగాణలో పర్యటించానని, అప్పటికి ఇప్పటికీ పచ్చదనం పెంపులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. అటవీ అర్బన్ పార్కుల్లో సౌకర్యాలు బాగున్నాయని, సందర్శకుల చిరునవ్వుల్లో ఆ సంతృప్తి కనిపిస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులు, నివాసయోగ్యమైన పరిసరాలను కాపాడుకోవడం మానవాళికి ముందున్న సవాల్ తెలిపారు. ఆ దిశగా ప్లాస్టిక్ నియంత్రణ, నీటి వనరులను కాపాడుకోవడం, విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన పర్యావరణ స్పృహను పెంచడం అందరి కర్తవ్యమన్నారు. హరితవిప్లవానికి అటవీ శాఖ కృషిని, అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు.