హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏపూరి సోమన్న.. తెలంగాణలో పరిచయం అక్కరలేని ప్రజాగాయకుడు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఏపూరి అటు రాజకీయాల్లో.. ఇటు సాంస్కృతిక కళారంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలకు కుడిభుజంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతాల్లో ఆమె రాజకీయాలు చేయటానికి మార్గదర్శనం చేసిన వారిలో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతోనూ కొంతకాలం ప్రయాణించారు. తెలంగాణ ఉద్యమంలో గళగర్జన చేసిన కళాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉద్యమంలో, ఉద్యమానంతర సమయంలోనూ తెలంగాణ అంతటా నాలుగువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజాకళాకారుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏపూరి తన పంథాను మార్చుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో గుంపులు.. గ్రూపులతో తెలంగాణకు తీవ్రనష్టం వాటిల్లబోతున్నదని పసిగట్టారు. ‘తెలంగాణకు ప్రత్యామ్నాయం.. పర్యాయపదం కేసీఆరే అని విశ్వసిస్తున్నాను’ అని ప్రకటించి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అడుగులో అడుగేయటానికి నిర్ణయించుకున్నారు.
త్వరలో గులాబీ గూటికి
ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సమక్షంలో కలిసిన ఆయన కేటీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఇరువురూ పరస్పర క్షేమసమాచారాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను త్వరలో బీఆర్ఎస్లో చేరనున్నట్టు ఏవూరి సోమన్న ప్రకటించారు. ప్రజాగాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి సోమన్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ అభివృద్ధిలో తానూ భాగస్వామ్యం కావాలని సోమన్న నిర్ణయించుకోవడం శుభపరిణామం అని కేటీఆర్ పేర్కొన్నారు. సందర్భం వచ్చినపుడు తెలంగాణ శక్తులన్నీ ఏకం అవుతాయని చెప్పటానికి ఏపూరి సోమన్న గొప్ప ఉదాహరణ అని తెలిపారు.
కొన్ని గ్రూపులతో తెలంగాణకు నష్టం: ఏపూరి
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రజల్లో ఉన్న. ప్రజల్లో బలంగా ఉన్న అభిప్రాయాలను, వారి జీవితాలను దగ్గరి నుంచి చూసిన అనుభవంతో చెప్తున్న. రాష్ట్రంలో తిరుగుతున్న కొన్ని గ్రూపుల వల్ల.. గ్యాంగులతో తెలంగాణకు నష్టం. మతతత్వశక్తులు, గ్రూపు రాజకీయాలతో తీవ్ర ప్రమాదం ఉన్నది’ అని ఏపూరి సోమన్న చెప్పారు. రాష్ట్రంలో తాను 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం మీద, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టమైందని పేర్కొన్నారు. తన అనుభవంతో చెప్తున్న మాట తప్ప సొంత అభిప్రాయం కాదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు ఆడిపాడినట్టే.. నేడు తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని, కేసీఆర్‌తో మమేకమై పనిచేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ఇంకా అభివృద్ధి జరగాలంటే అధి కేసీఆర్‌తోనే సాధ్యమని తేల్చిచెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కోసం తాను కేసీఆర్‌తోనే నడుస్తానని తెలిపారు.