హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : బీటెక్ ఫస్టియర్లో మరో 17,581 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ సీట్లు దక్కించుకున్న వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. దీంతో ఈ సీట్లు మళ్లీ ఖాళీ అయ్యాయి. ఎప్సెట్ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించారు. 22లోపు రిపోర్ట్చేయాలని అధికారులు సూచించారు. 77,561 సీట్లకు 59,980 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. మరో 17,581 మంది విద్యార్థులు రిపోర్ట్ చేయలేదు.
సీఎస్ఈ తత్సమాన బ్రాంచీల్లో 57,042 సీట్లకు 44,798 మంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో 14,054 సీట్లకు 10,594 మంది, మెకానిక్ ఇతర బ్రాంచీల్లో 5,632 సీట్లకు 3,943 మంది చొప్పున మాత్రమే రిపోర్ట్చేశారు. డిమాండ్ ఉన్న సీఎస్ఈ తత్సమాన బ్రాంచీల్లోనూ ఏడువేల మంది సీట్లు వదులుకున్నారు. మొదటి విడతలో 5,493 సీట్లు నిండలేదు. 17,581 సీట్లు ఖాళీ అయ్యాయి. 23,074 సీట్లు భర్తీకాలేదు. ఈ మొత్తం సీట్లను శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో విడత వెబ్ కౌన్సెలింగ్లో భర్తీచేయనున్నారు.
రెండో విడతకు సంబంధించి 25న విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 26, 27న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 27న ఆప్షన్లు ఫ్రీజ్ చేసుకోవచ్చు. 30న సీట్లు కేటాయిస్తారు. 30 నుంచి ఆగస్టు 1 వరకు ఫీజు చెల్లించి, ఆన్లైన్లో రిపోర్ట్చేయాల్సి ఉంటుంది. 31 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 3లోగా కాలేజీల్లో చేరిన వారి వివరాలు అప్డేట్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన సీట్లకు ఆగస్టు 5 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.