Damagundam Forest | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/పూడూరు, మే 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో చెరువులను ఉద్ధరిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణంతో చెలగాటమాడుతున్నది. నిన్నటికి నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోని పచ్చదనాన్ని విధ్వంసం చేయడంతోపాటు మూగజీవాల ఉసురు తీసిన సర్కారు చర్యలు… ఇప్పుడు వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలోనూ పునరావృతమవుతున్నాయి. నేవీరాడార్ సిగ్నల్ కేంద్రం కోసం అడవుల్ని అప్పగించిన ప్రభుత్వం ఆ మేరకు చెట్లు, మూగజీవాల రక్షణ చర్యల్ని గాలికొదిలేసింది. ఫలితంగా దశాబ్దాల చెట్లు వందలాదిగా ఎండిపోతుంటే పునరావాస చర్యలు లేక గూడు చెదిరిన జింకలు కుక్కలకు ఆహారంగా మారుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాదిరిగానే ఇక్కడా సర్కారు అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేనీరాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటు కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుమారు 2,900 ఎకరాల అటవీ భూమిని అప్పగించింది. ఈ మేరకు దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన 12 ఎకరాల భూమిని వదిలేసి, దాని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని నేవీ ఆధీనంలోకి తీసుకుంది. ఈ భూముల చుట్టూ ప్రహరీగోడ నిర్మించడంతో పాటు పలుచోట్ల భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీంతో అధికారులు, సిబ్బంది, ఇతరుల రాకపోకలు పెరగడంతో వన్యప్రాణులు చెల్లాచెదురవుతున్నాయి. జింకలన్నీ నీటి కోసం రామలింగేశ్వరస్వామి దేవాలయ పరిధిలోని కోనేరు వద్దకు వస్తున్నాయి. కుక్కలు మాటు వేసి, జింకల్ని వేటాడి చంపుతున్నాయి. ఇలా నెలరోజుల్లోనే నాలుగు జింకలు మృత్యువాతపడ్డాయి. కొన్ని జింకలు గాయపడితే అటవీశాఖ అధికారులకు తీసుకువెళ్లారని గ్రామస్థులు చెప్తున్నారు.
నేవీ స్వాధీనం చేసుకున్న భూముల్లో రహదారులు, భవన నిర్మాణ పనులు చేపట్టిన చోట 4,500 చెట్లను తొలగించి, మరోచోట నాటాలని (ట్రాన్స్‌లొకేషన్) అటవీశాఖ నిర్ణయించింది. ఇప్పటికే 2,800 చెట్లను మరోచోటికి తరలించారు. వాటిని తరలించడమే తప్ప తిరిగి అవి జీవం పోసుకునేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తరలింపు సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆ చెట్లన్నీ ఎండిపోయాయి. ఇంకా 1700 చోట్లను తరలించాల్సి ఉందని, వాటి పరిస్థితి కూడా ఇంతేనా అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి.. వికారాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్‌ను సంప్రదించగా.. చెట్లను తరలించడం వరకే తమ బాధ్యత అని స్పష్టంచేశారు. ఆ తర్వాత వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత నేవీ వాళ్లదేనని చెప్పుకొచ్చారు. వన్యప్రాణులకు సంబంధించి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలకు ఉంటుందని అన్నారు.
ఫారెస్టు అధికారులు ప్రతీరోజు పగలు, రాత్రి అడవిలో పరివేక్షించాలి. పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో 3 వేల ఎకరాలకు పైగా భూమి ఉంది. స్థానికులు వ్యతిరేకిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేవీ రాడర్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వెళ్తున్నాయి. చెట్లను నరికి భవన నిర్మాణాలు జరుపుతున్నారు. అడవిలో జన సంచారం అధికం కావడంతో వన్యప్రాణులు బయటికి వచ్చి కుక్కలబారిన పడి ప్రాణాలను కోల్పోతున్నాయి. నెలరోజుల్లోనే అనేక జింకలు మృత్యువాతపడ్డాయి. అధికారులు పరివేక్షించి అడవిలో నీటి సౌకర్యం ఏర్పాటుచేసి, మూగజీవాలను కాపాడాలి.
నేవి రాడర్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటుకై భవన నిర్మాణాలు చేపడుతున్నారు. చెట్ల తొలగింపుతో గాలి, వాతారణ కాలుష్యం ఏర్పడుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాము. పెద్ద చెట్లను తొలగించకుండా భవనాలు, రాడర్ నిర్మాణాలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వేల సంఖ్యలో చెట్లను తొలగించి, మరోచోట నాటినా ఫలితంలేదు. అడవిలో ఫారెస్ట్, నేవీ అధికారులు కొత్త మొక్కలను భారీ సంఖ్యలో నాటలేరు. చెట్ల తొలగింపుతో భారీ కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు దామగుండంలో అధిక సంఖ్యలో మొక్కలను నాటాలి.
నిన్నటికి నిన్న కంచ గచ్చిబౌలి భూముల్లో పచ్చదనాన్ని నాశనం చేసి మూగజీవాల ఉసురు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలోనూ పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నది. నేవీరాడార్ సిగ్నల్ కేంద్రం కోసం అడవులను అప్పగించి చెట్లు, మూగజీవాల రక్షణను గాలికొదిలేసింది. ఫలితంగా వందలాది చెట్లు ఎండిపోగా గూడు చెదిరిన జింకలు కుక్కలకు ఆహారమవుతున్నాయి.