హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : చెరువుల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా మూసీ బఫర్ జోన్ పరిధిలోనే వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్‌ను డెవలప్ చేసేందుకు సిద్ధమైంది. జల వనరులకు రెండు వందల మీటర్ల దూరంలో ఉండే ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ధారిస్తూ ఆరు నెలల క్రితం ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసింది. కాగా, ఇప్పుడు ఒక వెంచర్ కోసం మూసీకి వంద మీటర్ల దూరంలోనే వందల ఎకరాల భూములను సమీకరించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారం గ్రామంలో 130 ఎకరాల విస్తీర్ణంలో ఈ వెంచర్‌ను ఏర్పాటుచేయనున్నది. ఇందుకోసం మూసీకి వంద మీటర్ల దూరంలోనే ల్యాండ్ పూలింగ్ చేపట్టింది.
దీని కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నుంచి క్లియరెన్స్ కోసం ఏకంగా హెచ్ఎండీఏ కమిషనర్ ఈ నెల 13న ఎల్ఆర్ నంబర్ 518/ఎల్పీఎస్/హెచ్ఎండీఏ/2022/పీ తేదీ/13.06.25 పేరిట లేఖ రాశారు. ఒకవైపు చెరువుల సంరక్షణ పేరిట పేదల ఇండ్ల ను కూలగొడుతూ… మరోవైపు వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్లు వేసేలా నిబంధనలను అతిక్రమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హెచ్ఎండీఏ చేపట్టిన ప్రణాళికలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.