మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:21

పర్యావరణ అనుమతి అనవసరం

పర్యావరణ అనుమతి అనవసరం

  • నిర్మాణానికి ముందు అన్ని అనుమతులు తీసుకొంటాం
  • కూల్చివేతల వరకు అన్ని నిబంధనలు పాటించాం
  • హైకోర్టుకు వెల్లడించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ 
  • సచివాలయం కూల్చివేత కేసు నేటికి వాయిదా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విధంగా సమీకృత నూతన సచివాలయ భవననిర్మాణం చేపట్టడానికి ముందే అన్ని పర్యావరణ అనుమతులు తీసుకుంటామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు వెల్లడించారు. క్యాబినెట్‌ తీర్మాన ప్రతిని సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు సమర్పించారు. నిర్మాణం- కూల్చివేత వ్య ర్థాల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్లపై సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోమారు విచారించింది. కొత్త సచివాలయం కోసం భూమి చదునుకు ‘స్టేట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ’ నుంచి పర్యావరణ అనుమతి తీసుకున్నారా? అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ స్థితిలో పర్యావరణ అనుమతి అవసరం లేదని, భవనాల కూల్చివేత, వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను జీహెచ్‌ఎంసీకి సమర్పించి అనుమతి పొందామని ఏజీ తెలిపారు. కూల్చివేతలు సగం పూర్తయి.. భవనాల గోడలు ప్రమాదకరంగా ఉన్నాయని, ప్రభుత్వం పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలు నమోదుచేసుకున్న ధర్మాసనం.. ‘భూమి చదును చేయడం’ అనే అంశానికి ఇరువర్గాలు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నందున దీనికి సంబంధించిన తీర్పులు ఏమైనా ఉంటే సమర్పించాలని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదావేసింది.

కొత్త సచివాలయంలో మసీదు నిర్మిస్తాం

కొత్త సచివాలయంలో అన్ని సదుపాయాలతో మసీదును నిర్మిస్తామని  ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. పాత సచివాలయంలోని జామియా, హషీమ్‌ మసీదులను తొలిగించడంపై సదరు మసీదుల తరఫున న్యాయవాది జాకీర్‌ హుస్సేన్‌జావీద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మసీదు నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఇదే అంశంపై మెమో దాఖలుచేయాలని పేర్కొన్నది.

వచ్చేనెల 17 వరకు మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు 

అన్ని కేసుల్లో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఆగస్టు 17 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసినట్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం తెలిపారు. 


logo