హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ): గ్రూప్-1 ఫలితాల్లో అవతవకలు జరిగింది ముమ్మాటికీ వాస్తవమేనని, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ తనపై పరువునష్టం దావా వేస్తామని నోటీసుల పేరిట బెదిరింపులకు దిగడం దారుణమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నోటీసులకు మూడు రోజుల్లో దీటుగా సమాధానమిస్తా.. అంతేగాని ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదిలేదని తేల్చిచెప్పారు. తన ఆరోపణలు తప్పని టీజీపీఎస్సీ భావిస్తే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు అందించి అక్రమాలు రుజువుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
దేశ చరిత్రలోనే ఓ చట్టబద్ధ సంస్థ ఓ వ్యక్తి భావప్రకటన స్వేచ్ఛను కాలరాసేందుకు పూనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణభవన్‌లో రాకేశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాను లెవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే టీజీపీఎస్సీ ఇజ్జత్ దావాతో భయపెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. టీజీపీఎస్సీ తీరు చూస్తుంటే టీపీసీసీగా మారిందనే అనుమానం కలుగుతున్నదని విమర్శించారు.
‘వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు సర్వీసు కమిషన్‌కు ఎక్కడిది? నేను మాట్లాడితేనే పరువుపోయిందా? అదేమైనా కోర్టా? తన మాదిరిగా ఫిర్యాదు చేసిన అభ్యర్థులపై కేసులు పెడతారా? కథనాలు రాసిన పత్రికలపై పరువు నష్టం దావా వేస్తారా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమిషన్‌పై ఆరోపణలు చేయలేదా..? అని నిలదీశారు. కమిషన్ తాటాకు చప్పుళ్లు, ఉడుత ఊపులకు భయపడేది లేదని, నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బరిగీసి కొట్లాడుతామని పునరుద్ఘాటించారు.
పక్కా ఆధారాలతోనే సర్వీస్ కమిషన్‌పై ఆరోపణలు చేశానని రాకేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. 13 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసిన తాను అల్లాటప్పాగా ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన టీజీపీఎస్సీపైనే కోర్టులో దావా వేస్తానని హెచ్చరించారు. సర్కారు ఎన్ని కుట్రలు చేసిన, కుతంత్రాలకు దిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేదాకా విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు. తప్పు చేసిన టీజీపీఎస్సీయే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను టీజీపీఎస్సీపై నిరాధారణ ఆరోపణలు చేయలేదని, పరువు తీసే పనులు చేసింది టీజీపీఎస్సేనని రాకేశ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఇవ్వ డం? 563 మంది ర్యాంకర్లలో టాప్-500లో ఒక్క తెలుగుమీడియం అభ్యర్థి లేకపోవడం.. 46 సెంటర్లలో కేవలం రెండింటిలోనే ఎక్కువమంది సెలెక్ట్ కావడం.. వరుసగా ఉన్న అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు రావడం.. చూస్తుంటే కమిషన్ వెలగబెట్టిన ఘనకార్యం ఇట్టే తెలిసిపోతుంది’ అని ఘాటువ్యాఖ్యలు చేశారు. నిర్లక్ష్యం తనది కాదని ముమ్మాటికీ టీజీపీఎస్సీదేనని చెప్పారు.