ముషీరాబాద్, జనవరి 19: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం నిర్ణయం అట్టడుగువర్గాల పిల్లలకు దిక్సూచిగా నిలువబోతున్నదని చెప్పారు. బుధవారం విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ్ఞానమే దేశానికి దిక్సూచి అని, జ్ఞానమే అణగారినవర్గాలకు ఆయుధంగా నిలుస్తుందని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు బంగారు శ్రీనివాస్, నందకిశోర్, వరిగడ్డి చందు, నర్సాని రమేశ్, ధర్మారపు శ్రీకాంత్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.