హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న కొందరు ఇంజినీర్లు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)ని అస్సలు లెక్కచేయడంలేదు. ఐ డోంట్ కేర్ అంటూ రెచ్చిపోతున్నారు. ఏసీబీ దాడులు జరుగుతున్నా.. ఇంజినీర్లు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కుతున్నా ఉద్యోగుల్లో కించిత్తు భయం కనిపించడంలేదు. కొందరు దొరికిపోయినా మార్పు రావడంలేదు. ఇబ్రహీంబాగ్ ఏడీఏ అంబేద్కర్ అక్రమాల ఉదంతం మరుకముందే, గచ్చిబౌలి డివిజన్లో జూనియర్ లైన్‌మ్యాన్ ఏసీబీకి చిక్కాడు. తాజాగా శుక్రవారం లాలాపేటలో మరో ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి అవినీతి నిరోధకశాఖ వలలో పడ్డాడు. మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఈ నరేశ్ జూన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కగా ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ పట్టుబడ్డాడు. చిలుకూరులోనూ ఏఈ ఇంట్లో సోదాలు చేస్తే బాత్రూమ్లో రూ. 17లక్షలు దొరకడం పెను సంచలనంగా మారింది.
ఒకసారి దొరికినా మారని తీరు
ఏసీబీకి చిక్కిన తర్వాత సస్పెన్షన్, శాఖాపరమైన చర్యల వల్ల అధికారులు బుద్ధి తెచ్చుకుంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ విద్యుత్తు సంస్థల్లోని సిబ్బంది ఇందుకు పూర్తి విరుద్ధంగా తయారయ్యారు. ఒకసారి ఏసీబీకి చిక్కిన వారు రెండో సారి చిక్కుతుండటం గమనార్హం. బాచుపల్లిలో ఏఈగా పని చేసిన ఓ ఇంజినీర్ ఏసీబీకి పట్టుబడ్డడ్డాడు. అంతే కేసు క్లోజ్ అయ్యింది. ఆ ఆ తర్వాత ఏడీఈగా పదోన్నతి వచ్చింది. మియాపూర్‌లో ఏడీఈగా పనిచేస్తుండగా లంచం పుచ్చుకుని రెండోసారి ఏసీబీకి చిక్కాడు. మరో ఇంజినీర్ సంగారెడ్డిలో ఏడీఈగా ఉండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ దాడి విషయం తెలియడంతో ఇంట్లో ఉన్న డబ్బు కట్టలను చెత్తకుప్పలో పారేశారని చర్చ జరిగింది. ఆ కేసును డిపార్ట్మెంటల్ ఎం క్వైరీ పేరు తో క్లోజ్ చేశారు. డీఈగా పదోన్నతి ఇచ్చారు. మళ్లీ టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆ ఫీస్లో పనిచేస్తుండగా, మళ్లీ ఏసీబీకి చిక్కాడు.
విద్యుత్తుశాఖలో అవినీతి వింతలు
విద్యుత్తుశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు చిట్టా భారీగానే ఉన్నది. ఏ కార్యాలయం చూసుకున్నా కండ్లు బైర్లు కమ్మే లీలలు కనిపిస్తున్నాయి. అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ (ఏడీఈ) ఇబ్రహీంబాగ్, రంగారెడ్డి స్టోర్స్, పటాన్చెరులో పనిచేశారు. సదరు ఇంజినీర్ పటాన్చెరులో పని చేస్తున్నప్పుడు 17 కిలోమీటర్ల కండక్టర్ అమ్మినట్టు ఆరోపణలున్నాయి. పటాన్చెరులో ఒక ఏడీఈ గతంలో కుత్బుల్లాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో పనిచేశారు. పోస్టింగ్ కోసం రూ.40 లక్షలు ఖర్చుచేసినట్టు తెలిసింది. 33కేవీ లైన్ షిఫ్టింగ్ కోసం సంగారెడ్డి జిల్లాలో ఓ అధికారి రూ.40లక్షలు లంచంగా స్వీకరించినట్టు ఆ శాఖలోనే ప్రచారం జరిగింది. జాతీయ రహదారి విస్తరణలో 33 కేవీలైన్స్ షిప్టింగ్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని సమాచారం. దీనిపై ఓ ఎమ్మెల్సీ ఎస్ఈకి ఫిర్యాదు కూడా చేశారట. జెన్కోలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యో గం పొందిన ఒక ఏఈని ఉన్నతాధికారులు తొలగించారు. కానీ ఆ ఏఈ ఉద్యోగం కోసం మళ్లీ పైరవీలు చేస్తున్నారట. ఆ ఏఈని మళ్లీ ఉద్యోగంలో చేర్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అ వసరంలేదని కొందరు చెప్తున్నారు.