హైదరాబాద్, నవంబర్2 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (SLBC) అవుట్లెట్ టన్నెల్ కథ ఒడిసిన ముచ్చటేనని ఇంజినీర్లే తేల్చిచెప్తున్నారు. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్)తో కాకుండా మొత్తంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ (DBM)లోనే టన్నెల్ (SLBC Tunnel) పనులను కొనసాగించాలని నిర్ణయించారు. ఏరియల్ ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వేను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రూపొందించారు. డిండి రిజర్వాయర్ వరకు 43.50 కిలోమీటర్లు సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది.
అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి ఇన్లెట్ , మహబూబ్‌నగర్ జిల్లా మన్యవారిపల్లె నుంచి అవుట్లెట్ సొరంగం పనులను ఏకకాలంలో రెండువైపులా చేపట్టారు. ఇన్లెట్ వైపు నుంచి 13.93 కి.మీ. సొరంగం తవ్వగా ఫిబ్రవరి 22న సంభవించిన ప్రమాదంతో పనులు నిలిచిపోయాయి. అవుట్లెట్ వైపు నుంచి 22 కి.మీ. సొరంగం తవ్వారు. ఇప్పటివరకు రెండువైపుల నుంచి 34.372 కి.మీ. సొరంగం పనులు పూర్తయ్యాయి. 9.560 కి.మీ. మేర తవ్వాల్సి ఉన్నది. ఇన్లెట్ వైపు పనులు నిలిచిన దరిమిలా కనీసం అవుట్లెట్ వైపు నుంచి అయినా పనులు ముందుకు సాగుతాయని భావించారు.
అవుట్‌లెట్‌లోని టీబీఎం ప్రధాన బేరింగ్ వైఫల్యానికి గురికాగా, విదేశాల నుంచి మెయిన్ బేరింగ్ తీసుకొచ్చి రీప్లేస్ చేయగా 2023 జనవరి వరకు పనులు కొనసాగాయి. టీబీఎం ప్రధాన బేరింగ్, రింగ్ గేర్, అడాప్టర్, వింగ్స్ వంటి తదితర విడిభాగాలు మరమ్మతులకు గురయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ ఆ బేరింగ్‌ను తెప్పించి పనులను ప్రారంభిస్తామని తొలుత ప్రగల్భాలు పలికి ఒకే ఒక్క బేరింగ్‌ను తెప్పించింది. ఇతర విడిభాగాలను తెప్పించనేలేదు. కొన్ని విడిభాగాలను తీసి ఇన్లెట్లోని టీబీఎంకు అమర్చింది. ప్రస్తుతం ప్రమాదంలో అక్కడి టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది. మొత్తంగా అవుట్లెట్ టన్నెల్‌లోని టీబీఎం కోసం అన్ని విడిభాగాలను తెప్పించాలంటే దాదాపు రూ.70 కోట్లకు పైగానే నిధులు అవసరమవుతాయని అధికారుల అంచనా.
ఇన్లెట్ టన్నెల్లో ప్రమాదం సంభవించిన చోట ఉన్న మాదిరిగానే అవుట్లెట్ టన్నెల్‌లోనూ షీర్ జోన్లు తదితర అనేక క్లిష్టమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. విడిభాగాలు తెప్పించినా పనులు ఎంతవరకు కొనసాగుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఇంజినీర్లు వివరిస్తున్నారు. మొత్తంగా ఇన్లెట్నే కాకుండా, అవుట్లెట్ టన్నెల్‌ను డీబీఎం మెథడ్‌లోనే నిర్వహించాలని ప్రస్తుతం నిర్ణయించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ టన్నెల్లో 13.93 కి.మీ. వద్ద షీర్ జోన్ (పర్రెలు వారి వదులైన రాతిపొరలు) వద్ద పైకప్పు నిరుడు ఫిబ్రవరి 22న కూలింది. 50 మీటర్ల మేర పేరుకు పోయిన శిథిలాలను, మట్టి, రాళ్లను తొలగించలేని దుస్థితి. ఆ ప్రమాదంలో టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది. పనులను కొనసాగించాలంటే ప్రమాద స్థలాన్ని తప్పిస్తూ పక్కనుంచి మరో టన్నెల్ నిర్మించి అవుట్లెట్ టన్నెల్‌కు కలపాలని నిర్ణయించారు. 300 మీటర్లకు వెనక్కి వచ్చి అక్కడి నుంచి పక్కగా టన్నెల్ తవ్వుతూ అవుట్లెట్ టన్నెల్‌కు కలపాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇలా నిర్మించడం ద్వారా అదనంగా టన్నెల్ నిర్మాణం మరో 600 మీటర్లు పెరగనున్నదని అధికారవర్గాలు వెల్లడించాయి. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్‌లో పనుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిపుణులు హర్పాల్సింగ్, పరీక్ష్మెహ్రాను నియమించింది. ఇద్దరు ఈఈలు, 4 డీఈఈలు, 12 మందికిపైగా జేఈఈలతో డివిజన్‌ను ఏర్పాటు చేసి 3 షిప్టుల్లో పనులను కొనసాగించాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. కంట్రోల్ బ్లాస్టింగ్‌లో షార్ట్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం గతంలోనే సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. పనులను పునరుద్ధరణకు ఎన్జీఆర్ఐ నేతృత్వంలో జియోఫిజికల్ పరీక్షలను నిర్వహించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. టన్నెల్ నిర్మాణ మార్గం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఏరియల్ ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. సర్వే కోసం ప్రభుత్వం రూ.2.18 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూ రు చేసింది. ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో హెలిబోర్న్ మాగ్నటిక్ సర్వేను సోమవారం నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. 200 కిలోమీటర్ల మేర ఈ సర్వే నిర్వహించనున్నారు.
హెలికాప్టర్‌కు 24 మీటర్ల వ్యాసంతో ఉన్న స్పెషల్ ట్రాన్స్‌మీటర్‌ను బిగించి సర్వే చేయనున్నారు. భూమికి అడుగున 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ కండీషన్ డేటాను సేకరించారు. సర్వే ద్వారా షీర్ జోన్లు, నీటి ప్రవాహాలను గుర్తించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, టన్నెల్ స్పెషలిస్టు కల్నల్ పరాక్షిత్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ పర్యవేక్షణలో కొనసాగనున్న సర్వేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ మేరకు అవుట్లెట్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు.