Fee Reimbursement | రీయింబర్స్మెంట్ రాక..అవమానం భరించలేక..విద్యార్థి ఆత్మహత్య
సర్కార్‌పై ఎంతో భరోసాతో ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. సొంతంగా ఫీజు కట్టే స్థోమత లేక.. కాలేజీలో ఎదురైన అవమానం భరించలేక ఇంజినీరింగ్ విద్యార్థి బలన్మరణానికి పాల్పడటం రాష్ట్రంలో కలకలం రేపింది.
- ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. అవమానం భరించలేక..
- రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్ని రోజులుగా గైర్హాజరు
- అటెండెన్స్ లేదని హాల్ టికెట్ ఇవ్వని కాలేజీ యాజమాన్యం
- 95 వేలు ఫీజు, అటెండెన్స్ కోసం 5 వేలు కట్టాలని డిమాండ్
- బంగారం తాకట్టు పెట్టి బ్యాంకు రుణం కోసం తిరిగిన తండ్రి
- మనస్తాపంతో ప్రణీత్ ఆత్మహత్య హయత్‌నగర్‌లో ఘటన
- ఇబ్రహీంపట్నం శ్రీఇందూ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన
- జగిత్యాల నుంచి నగరానికి వలస వచ్చిన బాధిత కుటుంబం
హైదరాబాద్ సిటీబ్యూరో/రంగారెడ్డి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) /హయత్‌నగర్/ఇబ్నహీంపట్నం : సర్కార్‌పై ఎంతో భరోసాతో ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. సొంతంగా ఫీజు కట్టే స్థోమత లేక.. కాలేజీలో ఎదురైన అవమానం భరించలేక ఇంజినీరింగ్ విద్యార్థి బలన్మరణానికి పాల్పడటం రాష్ట్రంలో కలకలం రేపింది. శనివారం రాత్రి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరుగగా, విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమం టూ మృతుడి బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో విద్యార్థి సంఘా లు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా, గొల్లపల్లికి చెందిన మ్యాదరి రమేశ్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు వలస వచ్చి హయత్‌నగర్‌లోని రాఘవేంద్రనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కొడుకు ప్రణీత్ (21) ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందూ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా రాలేదు. దీంతో రూ.95 వేలు ఫీజు సొంతంగా కట్టాలని కాలేజీ యజమాన్యం సూచించింది. ఫీజు కోసం తండ్రి స్వగ్రామానికి వెళ్లి అక్కడ బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అటెండెన్స్ తక్కువ ఉన్నదని..
ప్రణీత్‌కు రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరుగడంతో చాలా రోజులపాటు విశ్రాంతిలో ఉన్నాడు. శుక్రవారం కాలేజీకి వెళ్లి తనకు హాల్ టికెట్ ఇవ్వాలని అడ్మినిస్ట్రేటివ్ అధికారి కృష్ణమూర్తి, ఇతర సిబ్బందిని అడిగాడు. 28 శాతమే హాజరు ఉన్నదని, ఫీజుతో పాటు రూ. 5 వేలు జరిమానా కడితే హాల్ టికెట్ ఇస్తామని వారు సూచించారు. తనకు ప్రమాదం జరగడంతో కాలేజీకి రాలేకపోయానని, అంత డబ్బు కట్టలేనని, దయచేసి తనకు హాల్‌టికెట్ ఇవ్వాలని విద్యార్థి వేడుకున్నాడు. డబ్బు కడితేనే హాల్ టికెట్ ఇస్తామంటూ సిబ్బంది కరాఖండిగా చెప్పడంతో పాటు ఎదురు మాట్లాడుతావా? అం టూ గదిలో 45 నిమిషాల పాటు నిల్చోబెట్టారు. తండ్రికి ఫోన్ చేసి ‘శనివారం ఉదయం వరకు కాలేజీకి వచ్చి ఫీజు కట్టాలి.. లేదంటే నీకొడుకు పరీక్షలు రాయడు’ అంటూ బెదిరించారు. ‘సోమవారం వచ్చి కడుతాను.. కాలేజీ ఫీజు కోసమే స్వగ్రామానికి వచ్చాను’ అని రమేశ్ వేడుకున్నా శనివారమే రావాలంటూ షరతు విధించారు. తనతో కాలేజీ యాజమాన్యం కఠినంగా వ్యవహరించడం, తన తండ్రిని కూడా అవమానించడంతో ప్రణీత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఇంట్లో ముభావంగా ఉన్న ప్రణీత్ రాత్రి తన సోదరి ఇంటికి వెళ్లాడు. ఓ గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఆదివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కళాశాల ఎదుట ఆందోళన
ప్రణీత్ ఆత్మహత్య విషయం తెలిసి స్నేహితులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు అతడి ఇంటి వద్దకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందూ కాలేజీ వద్దకు తీసికెళ్లి ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మృతదేహాన్ని బాధితులు స్వగ్రామానికి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

