హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంచాయతీరాజ్ రోడ్లు పలు చోట్ల దెబ్బతిన్నాయి. పీఆర్ రోడ్లకు రూ.20 కోట్ల వరకు నష్టం జరిగినట్టు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. 73 రోడ్లలో 50.41 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని నివేదించారు. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.1.95 కోట్లు అవసరమవుతాయని ఉన్నతాధికారులకు అంచనాలు పంపించారు. 56 క్రాస్ డ్రైనేజీ (సీడీ) వర్క్స్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు రూ.1.77 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. 21 చోట్లరోడ్లకు గండ్లు పడ్డాయని, వీటి శాశ్వత మరమ్మతులకు రూ.16.17 కోట్లు అవసరమని నివేదించారు. 20 కిలోమీటర్ల మేర మున్సిపల్ రోడ్లు, 14 కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు నివేదికలు పంపారు.