Engineering Counselling | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మరింత ఆలస్యంకానున్నదా? విద్యార్థులు మరికొంత కాలం వేచిచూడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అధికారులు కూడా ఇదే విషయం నొక్కి చెప్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌కు అనేక సమస్యలు అడ్డంకిగా మారాయి. ఆఫిలియేషన్లు, ఫీజుల ఖరారు, జోసా కౌన్సెలింగ్‌లు వంటివి అడ్డుగా నిలిచాయి. ఇవన్నీ చూస్తుంటే జూన్ దాటినా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల భర్తీ ఆలస్యమైతే తరగతుల నిర్వహణ ఆలస్యమవుతుంది.
రాష్ట్రంలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. మే 11న ఫలితాలు విడదలయ్యాయి. ఈసారి ఎప్‌సెట్ ఫలితాలను జెట్స్పీడ్తో విడుదల చేశారు. కానీ సీట్ల భర్తీలో, వెబ్ కౌన్సెలింగ్ ఆ వేగం లోపించింది. తాజా పరిస్థితి 2వ పేజీలోచూస్తుంటే జూలై రెండో వారం వరకు కౌన్సెలింగ్ కోసం వేచి చూడక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదలైన రోజు, లేదా మరుసటి రో జే వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన దాఖలాలున్నాయి. కానీ ఈసారి ఫలితాలు విడుదలైన 2 నెలల వరకు ఆగాల్సి వచ్చేలా ఉంది.
రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా ఫీజులను సవరించాల్సి ఉన్నది. తెలంగాణ ఫీజు అడ్మిషన్ అండ్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదించిన ఫీజులపై సర్కారు అభ్యంతరం వ్యక్తంచేసింది. టీఏఎఫ్ర్సీలో సభ్యురాలు కాని ఓ ఐఏఎస్ అధికారి ఈ సమావేశంలో పాల్గొని ఫీజులపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ప్రక్రియ మొదటికొచ్చింది. ఈ ఫీజులు ఖరారుకానిదే, ఫీజులు ఎంతన్నది తేలనిదే కౌన్సెలింగ్ నిర్వహించడం అసాధ్యం. కొంత కాలంగా ఐఐటీల్లో సీట్లు భర్తీచేసిన తర్వాతే మన దగ్గర ఇంజినీరింగ్ సీట్లను భర్తీచేస్తున్నారు. దీంతో మొదట ఐఐటీల్లో చేరాల్సిన వారు చేరగా, మిగిలిన వారు మన దగ్గర ప్రవేశాలు పొందుతున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 2న విడుదలకానున్నాయి. జూన్ 3 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆరు విడుతల కౌన్సెలింగ్ పూర్తికావాలంటే నెల రోజులు పడుతుంది. ఇంజినీరింగ్ కాలేజీల ఏఐసీటీఈ అఫిలియేషన్ ఇంకా కొలిక్కిరాలేదు. ఒక్క కాలేజీకి కూడా ఇప్పటి వరకు అనుమతులివ్వలేదు. సీట్ల లెక్క తేలలేదు. అఫిలియేషన్ల జారీ గడువును జూన్ 30 వరకు ఏఐసీటీఈ పొడిగించింది. ఈ అనుమతి లేకుండా ముందుకెళ్లడం కుదరదు. జూన్ 30లోపు కౌన్సెలింగ్ జరిగే అవకాశం లేదన్నమాటే. జూన్ నెలలో ఎప్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్ ఉండే అవకాశాల్లేవు. జూలై రెండో వారం తర్వాతే కౌన్సెలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.