డిచ్పల్లి, జూలై 31: ఇందూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరైంది. నాలుగు కోర్సులతో ఈ విద్యాసంవత్సరం నుంచి కళాశాల ప్రారంభంకానున్నదని టీయూ వీసీ యాదగిరిరావు తెలిపారు.
మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ చేపట్టనున్నట్టు వెల్లడించారు. రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి ఆయన గురువారం వర్సిటీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, డేటా సైన్స్ కోర్సులు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఒక్కో కో ర్సులో 60సీట్లతో మొత్తం 240 మం దికి ప్రవేశాలు లభిస్తాయని తెలిపారు.
టీయూలో ప్రభుత్వ ఇంజనీరింగ్ క ళాశాల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోనే బీజం పడిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. డిచ్పల్లికి డిగ్రీ కాలేజీ మంజూరు చేసిన సమయంలోనే ఇంజినీరింగ్ కాలేజీ కూడా ఇవ్వాలని కేసీఆర్కు ఆనాడే వినతిపత్రం ఇచ్చినట్టు గుర్తుచేశారు.