హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): బినామీ పేర్లతో కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి, సక్రమంగా పన్ను చెల్లించని బడాబాబులపై కొరడా ఝళిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎక్కువ బినామీ పేర్లతో కార్లు కొనుగోలు చేసిన దాదాపు 40 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇప్పటికే అనేకసార్లు ఈడీ విచారణ ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది. అతని వద్ద రూ.కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయని అధికారులు గుర్తించినట్టు సమాచారం.
చీకోటి ప్రవీణ్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన నసీర్, మోసిన్ పలువురు అనామకుల పేర్లతో కోట్ల విలువైన కార్లను కొనుగోలు చేసినట్టు అధికారుల దృష్టికి రావడంతో నోటీలు జారీ చేశారు. వీరిలో ఒకొక్కరి వద్ద రూ.10-12 కోట్ల విలువైన కార్లు ఉన్నట్టు తెలుస్తున్నది. వారిపై సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానున్నది. వీరంతా పన్ను చెల్లించకుండా బినామీ పేర్లతో లగ్జరీ కార్ల కొనుగోలు చేసి, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు గుర్తించడంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. వీరిలో కొందరిని ఐటీశాఖ ఇప్పటికే విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్టు సమాచారం.