హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక, పౌర హక్కుల పరిరక్షణ చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక, పౌర హక్కుల పరిరక్షణ చట్టాల అమలునకు సంబంధించి ఉన్నత స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురువారం జరిగింది . సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఐఎఎస్ అధికారులు విజయ్ కుమార్, యోగితారాణ ,క్రిస్టియానా చోంగ్తూ, డిఐజి శ్రీనివాస్ రావు, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ చట్టాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్నాయి. వీటిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలని అధికారులను ఆదేశించారు. ఈ చట్టాలను అమలు చేస్తున్న తీరు, బాధితులకు పరిహారంగా సుమారు 100 కోట్ల రూపాయలు అందించడం పట్ల కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే ప్రశంసించడాన్ని మంత్రి గుర్తు చేశారు.
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి,వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని సూచించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయాలి . డీఎస్పీలు త్వరితగతిన విచారణ పూర్తి చేసి, ఛార్జీషీటు వేసేట్టు చూడాలన్నారు. వరుస నేరాలకు పాల్పడే వారిపై రౌడీ షీట్ తెరవాలి.
ఈ చట్టాలు, నేరాలకు పాల్పడితే పడే జైలుశిక్షల గురించి విస్త్రత ప్రచారం, ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు జిల్లాలలోని పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల 30వ తేదీన జిల్లాలలో నిర్వహించే పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవానికి కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎస్పీ తదితర అధికారులు తప్పకుండా హాజరయ్యే విధంగా తగు ఆదేశాలివ్వాలిని సూచించారు.
కొన్ని కేసులలో చాలా కాలంగా స్టేలు ఉండడం గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయండి. అపాయింట్మెంట్ కోరండి. విక్టిమ్ రిలీఫ్ మానిటరింగ్ విభాగాన్ని పోలీసు చీఫ్ కార్యాలయంలో కాకుండా బయట ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఈ విషయమై డిజిపికి లేఖ రాయండి.
పోలీసు శాఖలో కొత్తగా చేరే అధికారులకు ఈ చట్టాల గురించి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
మళ్లీ 3 నెలలకు జరిపే ఈ ఉన్నత స్థాయి సమావేశానికి కేసుల సత్వర విచారణకు సహకరించాల్సిందిగా కోరుతూ రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ అధికారులను కూడా ఆహ్వానించాలన్నారు.